కైరోలో చిక్కిన నీరవ్ మోదీ అనుచరుడు.. భారత్ కు తరలింపు

  • ముఖ్య అనుచరుడు శంకర్ పరాబ్ అరెస్ట్
  • ముంబైకి తరలించిన వెంటనే ప్రకటించిన సీబీఐ
  • కోర్టులో హాజరు పరిచిన తర్వాత కస్టడీకి
  • విచారణతో కీలక సమాచారం తెలిసే అవకాశం
పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,578 కోట్లకు మోసగించి విదేశాలకు పరారైన వజ్రాభరణాల వ్యాపారి నీరవ్ మోదీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నీరవ్ మోదీ ముఖ్య అనుచరుడు సుభాష్ శంకర్ పరాబ్ (49) ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 

సీబీఐ బృందం ఈజిప్ట్ రాజధాని కైరో నుంచి అతడ్ని మంగళవారం ఉదయం ముంబైకి తీసుకొచ్చింది. నీరవ్ మోదీకి రైట్ హ్యాండ్ గా శంకర్ ను పరిగణిస్తున్నారు. నీరవ్ మోదీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్, డైమండ్ ఆర్ యూఎస్ కు డైరెక్టర్ గా శంకర్ పనిచేశాడు. 2018 జనవరిలో దుబాయి నుంచి అతడు కైరోకు పారిపోయాడు. అదే సమయంలో నీరవ్ మోదీ, ఆయన మామ మెహుల్ చోక్సీ కుటుంబ సభ్యులతో పాటు భారత్ నుంచి పరారు కావడం తెలిసిందే. 

కైరో నుంచి ముంబైకి తరలించిన వెంటనే శంకర్ పరాబ్ ను అరెస్ట్ చేసినట్టు సీబీఐ ప్రకటించింది. ముంబైలోని కోర్టులో హాజరుపరిచిన అనంతరం కస్టడీకి కోరనున్నారు. పీఎన్బీ భారీ స్కామ్ కేసును సీబీఐ విచారిస్తుండడం తెలిసిందే. పీఎన్ బీ అధికారులతో నీరవ్ మోదీ సంస్థలు కుమ్ముక్కు అయి ‘లెటర్స్ ఆఫ్ అండర్ టేకింగ్స్’ ద్వారా పెద్ద మొత్తంలో రుణాలు తీసుకుని చెల్లించకుండా ఎగ్గొట్టాయి. ఈ లెటర్స్ ను వసూలు చేసే బాధ్యతను శంకర్ పరాబ్ చూసినట్టు సీబీఐ అధికారులు చెబుతున్నారు. అతడ్ని విచారించడం కేసులో మరింత పురోగతికి దారితీయనుంది.


More Telugu News