భార‌త్‌తో సంబంధాల‌పై పాక్ కొత్త ప్ర‌ధాని కీల‌క వ్యాఖ్య‌లు

  • పాక్ ప్ర‌ధానిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన షెహ‌బాజ్ ష‌రీఫ్
  • తొలి ప్ర‌సంగంలోనే భార‌త్‌తో సంబంధాల ప్ర‌స్తావ‌న‌
  • అంత‌కుముందే క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం కావాల్సి ఉందని మెలిక‌
  • అంత‌ర్జాతీయ వేదిక‌ల‌పై క‌శ్మీర్‌ను ప్ర‌స్తావిస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌
  • క‌శ్మీర్ స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకుందామ‌ని మోదీకి పిలుపు
దాయాదీ దేశం పాకిస్థాన్ నూత‌న ప్ర‌ధాని షెహ‌బాజ్ ష‌రీఫ్ భార‌త్‌తో సంబంధాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం నాడు ఆ దేశ జాతీయ అసెంబ్లీలో పాక్ ప్ర‌ధానిగా ఏక‌గ్రీవంగా ఎన్నికైన మ‌రుక్ష‌ణ‌మే స‌భ‌లోనే ప్ర‌సంగించిన ష‌రీఫ్‌...భార‌త్‌తో స‌త్సంబంధాల‌ను కోరుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అయితే అంత‌కుముందే ఇరు దేశాల మ‌ధ్య స‌మ‌స్య‌గా ప‌రిణ‌మించిన క‌శ్మీర్‌పై ప‌రిష్కారం ల‌భించాల్సి ఉంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఈ దిశ‌గా త‌న తొలి ప్ర‌సంగంలోనే భార‌త్‌తో స‌త్సంబంధాలు, క‌శ్మీర్ స‌మ‌స్య‌కు ప‌రిష్కారంపై ప్ర‌స్తావించిన ష‌రీఫ్‌.. భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ పేరును కూడా ప్ర‌స్తావించారు. క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం కోసం న‌రేంద్ర మోదీ చొర చూపాల‌ని పిలుపునిచ్చిన ష‌రీఫ్‌.. స‌మ‌స్య ప‌రిష్కారం అయ్యేదాకా క‌శ్మీర్ అంశాన్ని వీల‌యిన అన్ని అంత‌ర్జాతీయ వేదిక‌ల మీద తాము ప్ర‌స్తావిస్తామ‌ని కూడా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. క‌శ్మీర్ స‌మ‌స్య ప‌రిష్కారం అయిన త‌ర్వాత ఆ ప్రాంతంలో నెల‌కొన్న పేద‌రికంపై ఇరు దేశాలు సంయుక్తంగా పోరాటం స‌ల‌పాల్సి ఉంద‌ని కూడా ష‌రీఫ్ అభిప్రాయ‌ప‌డ్డారు.


More Telugu News