పాక్ ప్ర‌ధానిగా షెహ‌బాజ్‌ష‌రీఫ్ ఏక్ర‌గీవంగా ఎన్నిక‌

  • అవిశ్వాసంలో ఓడిపోయిన ఇమ్రాన్ ఖాన్‌
  • షెహ‌బాజ్‌ను ప్ర‌ధానిగా ప్ర‌తిపాదించిన విప‌క్షాలు
  • జాతీయ అసెంబ్లీలో సోమ‌వారం జ‌రిగిన ఎన్నిక‌
  • అంత‌కుముందే రాజీనామాలు ప్ర‌క‌టించిన ఇమ్రాన్ పార్టీ
  • ష‌రీఫ్ ఏక‌గ్రీవంగా ఎన్నికైన‌ట్లు ప్ర‌క‌టించిన జాతీయ అసెంబ్లీ
పాకిస్థాన్ నూత‌న ప్ర‌ధాన మంత్రిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఎన్నిక‌య్యారు. పాక్ జాతీయ అసెంబ్లీలో జ‌రిగిన ఎన్నిక‌లో ఆయ‌న పాక్ ప్ర‌ధానిగా ఏక‌గ్రీవంగా ఎన్నిక‌య్యారు. పాక్ నూతన ప్ర‌ధాని ఎన్నిక కోసం సోమ‌వారం ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ఓటింగ్ జ‌ర‌గ‌గా.. ష‌రీఫ్ ఏకగ్రీవంగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు పాక్ జాతీయ అసెంబ్లీ కాసేప‌టి క్రితం ఓ ప్ర‌క‌ట‌న చేసింది.

పాక్ ప్ర‌ధానిగా మొన్న‌టిదాకా కొన‌సాగిన ఇమ్రాన్ ఖాన్‌పై విప‌క్షాలు అవిశ్వాస తీర్మానం ప్ర‌క‌టించ‌డం, ఆ తీర్మానానికి ఇమ్రాన్ పార్టీ మిత్ర‌ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు ప‌లికిన నేప‌థ్యంలో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ జ‌ర‌గ‌కుండా ఇమ్రాన్ అందుబాటులో ఉన్ని మార్గాల‌ను వినియోగించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఆయ‌న చ‌ర్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టిన సుప్రీంకోర్టు అవిశ్వాసంపై ఓటింగ్ జ‌ర‌గాల్సిందేన‌ని తీర్పు చెప్పిన విష‌య‌మూ విదిత‌మే. ఈ నేప‌థ్యంలో ఓటింగ్‌లో ఇమ్రాన్ స‌ర్కారు ఓట‌మిపాలు కాగా.. కొత్త ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్‌ను విప‌క్షాలు ప్ర‌తిపాదించాయి.

ఈ నేప‌థ్యంలో మెజారిటీని నిరూపించుకోవాలంటూ షెహ‌బాజ్‌కు జాతీయ అసెంబ్లీ పిలుపునిచ్చింది. ఈ మేర‌కు సోమ‌వారం జాతీయ అసెంబ్లీ స‌మావేశం కాగా.. అంత‌కుముందు జాతీయ అసెంబ్లీ స‌భ్య‌త్వానికి త‌న‌తో పాటు త‌న పార్టీ సభ్యులు కూడా రాజీనామా చేస్తున్న‌ట్టు ఇమ్రాన్ ప్ర‌క‌టించారు. అంతేకాకుండా సోమ‌వారం నాటి జాతీయ అసెంబ్లీకి హాజ‌రు కాలేదు. ఫ‌లితంగా పాక్ నూత‌న ప్ర‌ధానిగా షెహ‌బాజ్ ష‌రీఫ్ ఏక‌గ్రీవంగా ఎన్నికయ్యారు.


More Telugu News