ఈ కారుకు ఇంధనం అక్కర్లేదు.. ఏడుగురు ప్రయాణించొచ్చు

  • ఐదుగురికి కాళ్ల దగ్గర పెడల్స్
  • తొక్కుకుంటూ వెళ్లాలి
  • రెండు సీట్లు వృద్ధులు, తొక్కలేని వారి కోసం
  • 1000వాట్ల బీఎల్ డీసీ మోటారు కూడా ఉంటుంది
ఇంధనం లేకుండా పనిచేసే కారు ఉంటుందా? నిజమే ఉండదు. అందుకే ఇంధన అవసరం లేని కారును రూపొందించడంపై దృష్టి పెట్టిన ఓ టెక్ ఉద్యోగి సఫలీకృతుడయ్యాడు. అతడే హైదరాబాద్ కు చెందిన ప్రణయ్ ఉపాధ్యాయ. ఇతడు ఓ పెడల్ కారును తయారు చేశాడు. ఈ కారులో ఒకే సమయంలో ఏడుగురు కూర్చొని ప్రయాణించొచ్చు. సైకిల్ మాదిరే పెడల్ తొక్కుకుంటూ వెళ్లాలి. ఏడుగురిలో ఐదుగురికి కాళ్ల కింద పెడల్స్ ఉంటాయి. మిగిలిన రెండు సీట్లు వృద్ధులకు కేటాయించారు. 

పట్టణాల్లో రోజువారీ ప్రయాణాలకు ఇంధనం అవసరం లేని వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించాలన్నది ప్రణయ్ సంకల్పం. ఆటిజం వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి ప్రణయ్ తండ్రి. వాయు కాలుష్యం, ఆటిజం రెండింటికి మధ్య సంబంధం ఉందని ప్రణయ్ చెబుతున్నాడు. మన పిల్లల ఆరోగ్యం కోసం వాయు కాలుష్యాన్ని తగ్గించాల్సిన అవసరాన్ని ఆయన తెలియజేస్తున్నారు.

అతడు తయారు చేసిన పెడల్ కారు గంటకు 25-30 కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది. అన్ని సమయాల్లోనూ, ఎత్తయిన ప్రాంతాల్లో కారును తొక్కుకుంటూ వెళ్లడం కష్టం కదా. అందుకే 1,000 వాట్ల బీఎల్ డీసీ మోటారు కూడా అమర్చాడు. ఆ సమయంలో మోటారు సాయంతో కారు నడుస్తుంది. కారు రూఫ్ పై ఏర్పాటు చేసిన సోలార్ ప్యానెల్స్ ద్వారా బ్యాటరీ రీచార్జ్ అవుతుంది. రెండో దశలో కారును వెదురుతో చేస్తానని ప్రణయ్ ఉపాధ్యాయ తెలిపాడు. 


More Telugu News