రాముడు పుట్టకపోయి ఉంటే ఈ బీజేపీ వాళ్లు ఏ నినాదం ఎత్తుకునేవారో..?: ఉద్ధవ్ థాకరే

  • బీజేపీపై ధ్వజమెత్తిన మహా సీఎం
  • హిందుత్వంపై వీళ్లకే పేటెంట్ ఉన్నట్టు మాట్లాడుతున్నారని ఆగ్రహం
  • బీజేపీకి దారిచూపింది బాల్ థాకరే అని స్పష్టీకరణ
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై మహారాష్ట్ర సీఎం, శివసేన పార్టీ అధినేత ఉద్ధవ్ థాకరే మరోసారి ధ్వజమెత్తారు. హిందుత్వంపై తనకే సర్వహక్కులు ఉన్నట్టు బీజేపీ భావించరాదని హితవు పలికారు. హిందుత్వం, కాషాయం కలిస్తే కేంద్రంలో అధికారంలోకి రావొచ్చని బీజేపీకి మార్గదర్శనం చేసింది దివంగత శివసేన చీఫ్ బాల్ థాకరే అని ఉద్ధవ్ థాకరే స్పష్టం చేశారు. 

కాషాయం-హిందుత్వం కలయికపై శివసేన ఎప్పటికీ నిబద్ధతతో ఉంటుందని ఉద్ఘాటించారు. కానీ బీజేపీ మాత్రం భారతీయ జనసంఘ్, జనసంఘ్ అంటూ రకరకాల పేర్లతో భిన్నమైన సిద్ధాంతాలను ప్రచారం చేస్తోందని ఉద్ధవ్ థాకరే ఆరోపించారు. 

కొల్హాపూర్ నార్త్ నియోజకవర్గంలో ఈ నెల 12న ఉప ఎన్నిక జరగనుండగా, మహావికాస్ అఘాడీ కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ తరఫున సీఎం ఉద్ధవ్ థాకరే వర్చువల్ ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగానే ఆయన పైవ్యాఖ్యలు చేశారు. 

"హిందుత్వంపై తమకే అధికారం ఉంటుందని, దానిపై పేటెంట్ తమదే అన్నట్టుగా బీజేపీ భావిస్తుంటుంది. అది సరికాదు. నాకు ఒక విషయంలో ఆశ్చర్యం వేస్తుంది... ఒకవేళ రాముడే పుట్టకపోయి ఉంటే ఈ బీజేపీ వాళ్లు రాజకీయాల్లో ఏ నినాదం తలకెత్తుకునేవారో అనిపిస్తుంటుంది" అని ఉద్ధవ్ థాకరే పేర్కొన్నారు.


More Telugu News