రాజీనామాకు సిద్ధపడిన మేకతోటి సుచరిత!

  • ఏపీలో కొత్త మంత్రివర్గం
  • పలువురు పాత మంత్రులకూ చాన్స్
  • మేకతోటి సుచరితకు మొండిచేయి
  • రాజీనామా లేఖను ఎంపీ మోపిదేవికి ఇచ్చిన సుచరిత!
సీఎం జగన్ కొత్త క్యాబినెట్ ఖరారు చేసిన అనంతరం, కొందరు తాజా మాజీల్లోనూ, పలువురు ఆశావహుల్లోనూ అసంతృప్తి జ్వాలలు చెలరేగాయి. మాజీ హోంమంత్రి మేకతోటి సుచరిత తనను క్యాబినెట్ లో కొనసాగించనందుకు మనస్తాపం చెంది, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమైనట్టు వెల్లడైంది. 

మేకతోటి సుచరిత కుమార్తె రిషిక స్పందిస్తూ, మంత్రి పదవిలో ఎందుకు కొనసాగించలేదో పార్టీ నుంచి తగిన వివరణ లేదని వాపోయారు. రాజీనామా లేఖను వైసీపీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణకు ఇచ్చామని చెప్పారు. దీనిపై మోపిదేవి స్పందిస్తూ, వైసీపీ అంతా ఒకటే కుటుంబమని, అసంతృప్తులు ఉన్నా త్వరలోనే సమసిపోతాయని పేర్కొన్నారు. మంత్రి పదవి ఒక్కటే ముఖ్యం కాదని హితవు పలికారు. 

కాగా, మేకతోటి సుచరిత కుటుంబ సభ్యులు గత కొన్నిరోజులుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిసేందుకు విఫలయత్నాలు చేసినట్టు తెలిసింది. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన పలువురిని మంత్రివర్గంలో కొనసాగిస్తూ, తనను మాత్రం తప్పించడంపై మేకతోటి సుచరిత తీవ్ర వేదనకు గురైనట్టు సమాచారం.


More Telugu News