హీమోగ్లోబిన్ తగ్గితే ఎన్నో సమస్యలు.. పెంచుకునే మార్గాలు ఇవే..

  • రక్తంలో ఉండే ప్రొటీనే హిమోగ్లోబిన్
  • ఆక్సిజన్ సరఫరాకు సాయపడుతుంది
  • కార్బన్ డయాక్సైడ్ ను ఊరిపితిత్తులకు చేరుస్తుంది
  • ఆహారం రూపంలో తగినంత లభించేలా చూసుకోవాలి
రక్తం ఎంతున్నది? ఈ ప్రశ్న ప్రతి ఒక్కరికీ ఎప్పుడో అప్పుడు ఎదురవుతూనే ఉంటుంది. రక్త పరీక్ష చేయించుకుంటే హిమోగ్లోబిన్ శాతం తెలుస్తుంది. రక్తం అంటే ప్లాస్మా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్ లెట్స్ కలయిక. ఈ రక్తంలో ఉండే ప్రొటీన్ హిమోగ్లోబిన్. ఇది శరీర ఆరోగ్యంలో కీలకమైన పాత్ర పోషిస్తుంది. 

రక్తం ద్వారా శరీరంలోని ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆక్సిజన్ సరఫరాలో హిమోగ్లోబిన్ ప్రొటీనే కీలకంగా వ్యవహరిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ను శరీరం నుంచి బయటకు పంపించేందుకు వీలుగా ఊపిరితిత్తులకు చేరవేస్తుంది. కొన్ని సందర్భాల్లో హిమోగ్లోబిన్ శాతం తగ్గిపోతుంటుంది. ఐరన్ లోపం వల్ల, కాలేయ సంబంధిత సమస్యలు, గర్భం దాల్చడం ఇలా ఎన్నో కారణాలు ఉంటాయి. మహిళలకు డెసీలీటర్ రక్తంలో 13 గ్రాములకు తక్కువగా ఉంటే దాన్ని లోపంగా చూస్తారు. పురుషుల్లో 13.5 గ్రాములకు తగ్గితే లోపంగా పరిగణిస్తారు. దీన్ని పెంచుకోవడం వల్ల శరీర జీవక్రియలకు ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు.

ఐరన్ 
తీసుకునే ఆహారంలో ఐరన్ తగినంత లభించేలా చూసుకోవాలి. హిమోగ్లోబిన్ ప్రొటీన్ కు ఐరన్ పోషకంగా పనిచేస్తుంది. బీన్స్, పాలకూర, గోంగూర, షెల్ ఫిష్ తీసుకోవడం వల్ల ఐరన్ తగినంత అందుతుంది. 

వీటి పట్ల జాగ్రత్త..
శరీరం ఐరన్ ను గ్రహించాలంటే అందుకు విటమన్ సీ, ఏ కీలకంగా పనిచేస్తాయి. కనుక విటమిన్ సీ, ఏ తగినంత అందేలా చూసుకోవడం అవసరం. ఐరన్ ను శరీరం గ్రహించకుండా క్యాల్షియం అడ్డుకుంటుంది. కనుక హిమోగ్లోబిన్, రక్తం తక్కువగా ఉన్న వారు క్యాల్షియం ఎక్కువగా లభించే డైరీ ఉత్పత్తులు, సోయాబీన్స్, ఫిగ్స్ వంటి వాటిని తక్కువగా తీసుకోవాలి. 

ఫొలేట్
ఇది విటమన్ బీ9. హిమోగ్లోబిన్ లోని హిమే ఉత్పత్తికి ఫొలేట్ పనిచేస్తుంది. ఎర్ర రక్త కణాల వృద్దికి సాయపడుతుంది. అందుకని హిమోగ్లోబిన్ పెరగడానికి ఫొలేట్ ఎక్కువగా లభించే క్యాబేజీ, పాలకూర, చిక్ పీస్, కిడ్నీ బీన్స్, ఆకుపచ్చని కూరగాయలను తీసుకోవాలి.

సప్లిమెంట్లు..
ఐరన్ ను పెంచేందుకు ఔషధాలు అందుబాటులో ఉన్నాయి. వీటిని వైద్యుని సూచనల మేరకు తీసుకోవాలి. అదే సమయంలో వీలైనంత వరకు ఆహారం ద్వారా ఐరన్, ఫోలిక్ యాసిడ్ అందేలా చూసుకుంటే మంచిది. మహిళలు, చిన్నారులు, వృద్ధులు కనీసం ఆరు నెలలు, ఏడాదికి ఒకసారి అయినా వైద్య నిపుణులను సంప్రదించి పరీక్షల ద్వారా వీటిని నిర్ధారించుకోవాలి.


More Telugu News