9 రోజుల్లో 300 సార్లు అగ్ని ప్రమాదాలు.. యూపీలో అంతుబట్టని మిస్టరీ

  • ముగ్గురు సోదరుల ఇళ్లకే పరిమితమైన ప్రమాదాలు
  • ఉన్నట్టుండి ఇంట్లో ఎక్కడైనా అగ్గి 
  • గ్రామస్థుల ప్రత్యేక పూజలు
  • గ్రామంలో ఉన్నతాధికారుల బృందం పర్యటన
ముగ్గురు సోదరులు. రూప్ సింగ్, కన్షాయ్ పాల్ సింగ్, వీరేంద్ర సింగ్. వీరిళ్లలో ఉన్నట్టుండి అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇళ్లతోపాటు వారి పొలాల్లోనూ ఇదే జరుగుతుండడంతో,  దీని వెనుక కారణాలేంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. యూపీలోని రాయపూర్ (కాస్ గంజ్) ప్రాంతంలో ఇది వెలుగులోకి వచ్చింది. ఏప్రిల్ 1న మొదటిసారి అగ్గి రాజుకుంది. శనివారం కూడా ముగ్గురి సోదరుల్లో ఒకరి ఇంట్లో, మరొకరి గ్రోసరీ దుకాణంలో అగ్గి లేచింది. 

గత గురువారం కూడా ముగ్గురిలో ఒకరి భూమిలో అగ్ని కీలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటనలతో గ్రామవాసుల్లో భయం పట్టుకుంది. ముగ్గురు సోదరులు కూడా భయంతో ఇళ్ల బయటే ఉంటున్నారు. ఫోరెన్సిక్ బృందం, అగ్నిమాపక శకటాన్ని గ్రామంలోకి దింపారు. మరోవైపు గ్రామస్థులు ఈ ఘటనతో పూజలు నిర్వహించారు. 30 మంది తాంత్రికులు వచ్చి వీరితో పూజలు చేయించినట్టు తెలుస్తోంది. 

‘‘అగ్ని ఉన్నట్టుండి పుడుతోంది. బెడ్, కర్టెన్లు, వస్త్రాలు, కేలండర్లు, ఇతర వస్తువుల్లో అగ్ని కీలలు వస్తున్నాయి. దాంతో మాకు తీవ్రంగా నష్టం ఏర్పడుతోంది. మేం సాయం కోసం అన్వేషించే స్థితిలో ఉన్నాం’’అని వీరేంద్ర సింగ్ తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్ ఇతర ఉన్నతాధికారుల బృందం గ్రామంలో పర్యటించింది. అగ్ని ప్రమాదాలు ఉన్నట్టుండి ఏర్పడుతున్నట్టు వారు సైతం గుర్తించారు. బాధితులను పరిహారంతో ఆదుకునేందుకు కసరత్తు చేస్తున్నారు.


More Telugu News