కరోనాపై పోరాటానికి బూస్టర్ డోస్ సాయపడుతుంది: కేంద్ర ఆరోగ్య మంత్రి మాండవీయ

  • దేశవ్యాప్తంగా ప్రికాషనరీ టీకా కార్యక్రమం మొదలు
  • ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి తీసుకోవాలి
  • ఒక్కో డోస్ ధర రూ.250
  • రూ.150 సర్వీస్ చార్జీ అదనం
దేశవ్యాప్తంగా కరోనా ప్రికాషనరీ టీకా కార్యక్రమం (బూస్టర్ షాట్) ఆదివారం మొదలైంది. ఈ సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మనుసుఖ్ మాండవీయ ట్విట్టర్ లో స్పందించారు. ‘‘ప్రధాని నరేంద్రమోదీ నాయకత్వంలోని ప్రభుత్వం కరోనా మహమ్మారిని ఓడించేందుకు ఎన్నో చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నేటి నుంచి 18 ఏళ్లు పైబడిన వారికి ప్రైవేటు కేంద్రాల్లో టీకాలు ఇచ్చే కార్యక్రమం కొనసాగుతుంది. 18 ఏళ్లు నిండిన అందరూ ముందుకు వచ్చి ప్రికాషనరీ డోసు తీసుకుని కరోనాపై పోరును బలోపేతం చేయాలి’’అంటూ మంత్రి మాండవీయ ట్వీట్ చేశారు. 

దేశంలో కొత్తగా ఎక్స్ఈ వేరియంట్ రకం వెలుగు చూడడంతో ప్రికాషనరీ డోస్ కార్యక్రమాన్ని కేంద్రం వేగంగా ప్రారంభించింది. ఇప్పటి వరకు దేశ ప్రజలు అందరికీ కరోనా టీకాలను ఉచితంగా అందించగా.. ప్రికాషనరీ డోస్ కు ఆ అవకాశం లేదు. ప్రజలే టీకాకు అయ్యే ఖర్చును పెట్టుకోవాలి. కోవాగ్జిన్, కోవిషీల్డ్ ప్రికాషనరీ డోస్ ధర రూ.250 కాగా, టీకా ఇచ్చినందుకు సర్వీస్ చార్జీ రూ.150 మించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో తీసుకున్న కంపెనీల టీకాలనే ప్రికాషనరీ డోస్ గా ఇవ్వనున్నారు.


More Telugu News