సీఎం జ‌గ‌న్ క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందే: బీజేపీ నేత భానుప్ర‌కాశ్ రెడ్డి

  • సీఎం హోదాలో అస‌భ్య‌క‌ర ప‌ద‌జాలం త‌గ‌దన్న భానుప్రకాశ్ 
  • ఏపీ ప‌రిస్థితుల‌పై ఢిల్లీ పెద్ద‌లు చీద‌రించుకుంటున్నారని వ్యాఖ్య 
  • అప్పుల‌పై శ్వేతప‌త్రం విడుద‌ల చేయాల‌ని డిమాండ్
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి శుక్ర‌వారం నాటి నంద్యాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా చేసిన వ్యాఖ్య‌ల‌కు క్ష‌మాప‌ణ చెప్పి తీరాల్సిందేనని బీజేపీ నేత, టీటీడీ పాల‌క మండ‌లి మాజీ స‌భ్యుడు భాను ప్ర‌కాశ్ రెడ్డి డిమాండ్ చేశారు.  ప్రజాస్వామ్యంలో ప్రజలకు, ప్రతిపక్షాలకు, పత్రికలకు ప్రశ్నించే హక్కు ఉంటుందన్న ఆయ‌న‌.. వారిని ఉద్దేశించి వెంట్రుక కూడా పీకలేరని సీఎం జగన్ అనడం బాధాకరమ‌ని వ్యాఖ్యానించారు. 

సీఎం హోదాలో ఉన్న వ్యక్తి ఇలాంటి అసభ్యకర పదజాలం వాడటం బాధాకరమ‌న్న భానుప్ర‌కాశ్ రెడ్డి.. వెంట్రుక పీకడానికి, గుండు కొట్టించుకోవడానికి సీఎం పదవి ఎందుకని ప్ర‌శ్నించారు.  జగన్ తన వ్యాఖ్యలపై వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఏపీ పరిస్థితులపై ఢిల్లీ పెద్దలు చీదరించుకుంటున్నారని ఆయ‌న అన్నారు. రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిన సీఎం జగన్ విద్యుత్ అప్పులు ఎందుకు తీర్చలేకపోయారని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు.


More Telugu News