ఐపీఎల్ తాజా సీజన్ లో అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన సన్ రైజర్స్ పేసర్

  • 153.1 కిమీ వేగంతో బంతిని విసిరిన ఉమ్రాన్ మాలిక్
  • తడబాటుకు గురైన రాయుడు
  • ఉమ్రాన్ వయసు 22 ఏళ్లు
  • ఉజ్వల భవిష్యత్ ఉందంటున్న మాజీలు
సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో యువ నైపుణ్యానికి కొదవలేదు. ఆ జట్టులో పలువురు ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఉన్నారు. వారిలో ఉమ్రాన్ మాలిక్ ఒకడు. కశ్మీర్ కు చెందిన ఈ స్పీడ్ స్టర్ తన వేగంతో ఐపీఎల్ లో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. అయితే ఉమ్రాన్ మాలిక్ తన వేగానికి టెక్నిక్ జోడించడంలో ఇంకా పరిణతి సాధించాల్సి ఉందని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అందుకే వికెట్ల వేటలో వెనుకబడుతున్నాడని విశ్లేషించారు. 

ఇక అసలు విషయానికొస్తే... నేడు సన్ రైజర్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ తో తలపడుతోంది. టాస్ ఓడిన చెన్నై బ్యాటింగ్ కు దిగగా, ఉమ్రాన్ మాలిక్ ఈ టోర్నీలోనే అత్యంత వేగవంతమైన బంతిని విసిరాడు. ఇన్నింగ్స్ 9వ ఓవర్లో అంబటి రాయుడికి వేసిన ఆ బంతి 153.1 కిలోమీటర్ల వేగం నమోదు చేసింది. రాయుడు ఆ బంతిని ఆడడంలో తడబడ్డాడు. 

22 ఏళ్ల ఉమ్రాన్ తన బౌలింగ్ కు మరింత మెరుగులు దిద్దుకుంటే భవిష్యత్తులో టీమిండియాకు ఓ సూపర్ ఫాస్ట్ బౌలర్ గా ఎదుగుతాడని మాజీలు చెబుతున్నారు.


More Telugu News