పవర్ కట్ పాపం మీది కాదా?: జ‌గ‌న్ స‌ర్కారుపై సోము వీర్రాజు ఫైర్‌

  • పోల‌వ‌రాన్ని కేంద్రానికి వ‌దిలేయండన్న వీర్రాజు 
  • త‌క్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల ప‌నులు చూసుకోమని సలహా 
  • 2024లో బీజేపీ అధికారంలోకి వ‌స్తుందని వ్యాఖ్య 
  • రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామన్న వీర్రాజు
ఏపీలో విద్యుత్ కోత‌ల పాపం ఎవ‌రిది? అంటూ ప్ర‌శ్నించిన బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు.. ఆ పాపం వైసీపీ స‌ర్కారుది కాదా? అంటూ నిప్పులు చెరిగారు. ఈ మేర‌కు శ‌నివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ జ‌గ‌న్ స‌ర్కారుపై విరుచుకుపడ్డారు. ప్ర‌భుత్వానికి ముందు చూపు ఉంటే ఈ కోత‌లు త‌ప్పేవి కాదా? అని ప్రశ్నించారు. 10 వేల మెగావాట్ల విద్యుత్‌కు నిధులు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధ‌మైంద‌ని కూడా ఆయ‌న వ్యాఖ్యానించారు. 

ఈ సంద‌ర్భంగా ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించిన వీర్రాజు.. వంటిగ‌డ్డ వంటి రూ.10 ల‌క్ష‌ల ఖ‌ర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టుల‌ను ప‌ట్టించుకోవాల‌ని జ‌గ‌న్ స‌ర్కారుకు సూచించారు. పోల‌వ‌రం ప్రాజెక్టును కేంద్రానికి వ‌దిలేయాల‌ని కూడా ఆయ‌న స‌ల‌హా ఇచ్చారు. పోల‌వ‌రం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి స‌మీక్ష చేస్తున్నార‌న్న వీర్రాజు.. ఉత్త‌రాంధ్ర ప్రాజెక్టుల‌పై జ‌గ‌న్ స‌ర్కారు ఏం చేస్తోంద‌ని ప్ర‌శ్నించారు. 

రాష్ట్రంలో నిజ‌మైన స‌మ‌స్య‌లు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర‌లోనే ఉన్నాయ‌న్నారు. 2024లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని, అప్పుడు రాయ‌ల‌సీమ‌, ఉత్త‌రాంధ్ర స‌మ‌స్య‌ల‌న్నింటినీ ప‌రిష్క‌రిస్తామ‌ని ఆయ‌న తెలిపారు. బియ్యాన్ని రేష‌న్ షాపుల‌కు వెళ్లి తీసుకోలేరా?.. ఆ మాత్రం దానికి వ్యానుల్లో పెట్టి అమ్మ‌డం ఎందుక‌ని కూడా ఆయ‌న ప్ర‌శ్నించారు.


More Telugu News