మత్తులో చేయడానికి ఇదేం నవ్వులాట కాదు.. చాహల్ కు జరిగిన ఘటనపై రవిశాస్త్రి సీరియస్

  • జీవితాంతం బ్యాన్ చేయాలని డిమాండ్
  • మత్తులో తప్పులు ఎక్కువగా జరిగే ప్రమాదం
  • ఇలాంటి ఘటనలపై ఆటగాళ్లు వెంటనే ఫిర్యాదు చేయాలని సూచన
యుజ్వేంద్ర చాహల్ కు గతంలో జరిగిన ఘటనపై టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. ఐపీఎల్ 2013లో ముంబై ఇండియన్స్ కు ఆడుతున్నప్పుడు ఓ ఆటగాడు తాగేసి తనను హోటల్ 15వ అంతస్తు బాల్కనీ నుంచి వేలాడదీశాడని చాహల్ షాకింగ్ విషయం చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చాహల్ వ్యాఖ్యలపై రవి శాస్త్రి స్పందించారు.  

ఇదేం నవ్వులాట కాదని, చాలా తీవ్రమైన విషయమని, ఆందోళన కలిగించేదని అన్నారు. తాగిన మత్తులో ఆ ఆటగాడు ఇంతటి పనికి పాల్పడి ఉంటే అది చాలా ఆందోళన కలిగించే విషయమేనని స్పష్టం చేశారు. 

‘‘నాకు ఆ వ్యక్తి ఎవరన్నది తెలియదు. ఎవరి ప్రాణాన్నైనా ప్రమాదంలోకి నెట్టేయడం ఎదుటివాళ్లకు సరదా అయి ఉండొచ్చు. కానీ, నా వరకు మాత్రం చాలా తీవ్రమైన అంశం. మత్తులో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి పాల్పడితే ఎక్కడో అక్కడ తప్పు జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్షమించారని విషయం’’ అని తేల్చి చెప్పారు. 

ఇంతటి దారుణమైన ఘటనను తాను తొలిసారి వింటున్నానని రవిశాస్త్రి చెప్పారు. అదే అలాంటి ఘటన ఇప్పుడు జరిగే ఉంటే.. ఆటగాడిని భయపెట్టిన సదరు ఆటగాడిపై జీవితకాల నిషేధం విధించి, పునరావాస శిబిరానికి పంపించే వారని పేర్కొన్నారు. కాబట్టి చాహల్ కు జరిగిన ఘటనలో నిందితుడైన ఆటగాడిని జీవితాంతం నిషేధించి.. మైదానంలోకి అడుగుపెట్టకుండా చేస్తే మళ్లీ అలాంటి తప్పులు చేయరన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆటగాళ్లు వెంటనే ఫిర్యాదు చేయాలని శాస్త్రి సూచించారు.


More Telugu News