గుజరాత్ థ్రిల్లింగ్ విన్.. చివరి బంతికి సిక్స్ కొట్టి విజయాన్ని అందించిన తెవాటియా

  • 4 పరుగుల తేడాతో సెంచరీ మిస్సయిన గిల్
  • చివరి రెండు బంతులకు సిక్సర్ కొట్టిన తెవాటియా
  • వరుసగా మూడో విజయాన్ని నమోదు చేసిన టైటాన్స్
ఐపీఎల్‌లో భాగంగా ముంబైలోని బ్రాబౌర్న్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో గతరాత్రి జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. చివరి రెండు బంతులను సిక్సర్లుగా మలిచిన రాహుల్ తెవాటియా జట్టుకు అద్వితీయ విజయాన్ని అందించాడు. హ్యాట్రిక్ విజయాలతో గుజరాత్ ఇప్పుడు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. 

పంజాబ్ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్‌ 32 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. మాథ్యూ వేడ్ (6) మరోమారు నిరాశపరిచాడు. మరో ఓపెనర్ శుభమన్ గిల్ మాత్రం చెలరేగిపోయాడు. 59 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్‌తో 96 పరుగులు చేసి త్రుటిలో శతకాన్ని మిస్సయ్యాడు. 

ఇక సాయి సుదర్శన్ 35, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 27 పరుగులు చేశారు. చివరి రెండు ఓవర్లలో 32 పరుగులు అవసరం కావడంతో ఉత్కంఠ నెలకొంది. 19వ ఓవర్‌లో 13 పరుగులొచ్చాయి. అయితే, గిల్ అవుటయ్యాడు. చివరి ఆరు బంతుల్లో 19 పరుగులు అవసరం కావడంతో విజయం పంజాబ్ వైపు మొగ్గింది. దీనికి తోడు తొలి బంతికే హార్దిక్ పాండ్యా రనౌట్ కావడంతో పంజాబ్ విజయం లాంఛనమే అనుకున్నారు. 

అయితే, క్రీజులోకి వచ్చిన తెవాటియా పంజాబ్ ఆశలపై నీళ్లు చిలకరించాడు. ఎదుర్కొన్న తొలి బంతికి సింగిల్‌ తీశాడు. మూడో బంతికి మిల్లర్ ఫోర్ కొట్టి నాలుగో బంతికి సింగిల్ తీశాడు. దీంతో తెవాటియా స్ట్రైకింగ్‌లోకి వచ్చాడు. ఓడియన్ స్మిత్ వేసిన ఐదో బంతిని తెవాటియా సిక్సర్‌గా మలిచాడు. దీంతో ఉత్కంఠ మరింత పెరిగింది. 

ఇక, చివరి బంతికి సిక్స్ కొడితే గుజరాత్ విజయం సాధిస్తుంది. లేదంటే విజయం పంజాబ్ సొంతమవుతుంది. ఈ క్రమంలో చివరి బంతిని కూడా బలంగా బాదిన తెవాటియా దానిని కూడా స్టాండ్స్‌లోకి పంపి పంజాబ్‌కు కోలుకోలేని షాకిచ్చాడు. ఫలితంగా టైటాన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధింది. త్రుటిలో సెంచరీ చేజార్చుకున్న గిల్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. లియామ్ లివింగ్ స్టోన్ గుజరాత్ బౌలర్లను ఊచకోత కోశాడు. 27 బంతుల్లోనే 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ 35, జితేశ్ శర్మ 11 బంతుల్లో 23 పరుగులు చేశారు. ఆఖర్లో రాహుల్ చాహర్ బ్యాట్ ఝళిపించడంతో పంజాబ్ కు భారీ స్కోరు సాధ్యమైంది. చాహర్ 14 బంతుల్లో 22 పరుగులు చేశాడు. గుజరాత్ బౌలర్లలో లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ 3 వికెట్లు తీయగా, కొత్త కుర్రాడు దర్శన్ నల్కండే 2, మహ్మద్ షమీ 1, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 1, లాకీ ఫెర్గుసన్ 1 వికెట్ తీశారు.


More Telugu News