నిజంగానే పెను విషాదమే.. తన సేనల నష్టాన్ని ఎట్టకేలకు ఒప్పుకొన్న రష్యా

  • రష్యా బలగాల మరణంపై క్రెమ్లిన్ ప్రకటన
  • చాలా మంది చనిపోయారని విచారం
  • యుద్ధం తొలినాళ్లలో ఎత్తులు పారలేదని వ్యాఖ్య
  • కీవ్ నుంచి వైదొలగడం రష్యా మంచితనమని కామెంట్
ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా వైపూ సైనికులు భారీగానే చనిపోయారని ఎప్పటికప్పుడు ఉక్రెయిన్ సైన్యం అధికారిక ప్రకటనలు విడుదల చేస్తున్నా.. రష్యా మాత్రం వాటిని ఖండిస్తూ వస్తోంది. కానీ, తాజాగా ఆ విషయాన్ని ఒప్పుకొంది. తమవైపు సైనికులు చాలా మంది చనిపోయారని, ఇది పెను విషాదమని క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్పారు. 

మృతుల సంఖ్య భారీగా పెరుగుతోందని విచారం వ్యక్తం చేశారు. ఓ బ్రిటీష్ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ రాజధాని కీవ్, చెర్నిహివ్ నుంచి బలగాలను వెనక్కు పిలిపించేయడం రష్యా మంచితనమని పెస్కోవ్ అన్నారు. యుద్ధం మొదలుపెట్టిన తొలి నాళ్లలో తమ ఎత్తులు పారలేదన్నారు. 

ఉక్రెయిన్ సైన్యం లెక్కల ప్రకారం ఇప్పటిదాకా రష్యాకు చెందిన 18 వేల మంది సైనికులు చనిపోయినట్టు తెలుస్తోంది. నాటో కూడా 7 వేల నుంచి 15 వేల మంది మధ్య రష్యా సైనికులు చనిపోయారని అంచనా వేస్తోంది. రష్యా మాత్రం 1,351 మంది సైనికులే చనిపోయారని, 3,825 మంది గాయపడ్డారని గత నెల 25న ప్రకటించింది.


More Telugu News