అనంతపురం జిల్లాలో విద్యుత్ సిబ్బందిని నిర్బంధించిన రైతులు

  • రోజుకు ఐదారుగంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదని ఆందోళన
  • పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన
  • ఉన్నతాధికారుల హామీతో శాంతించిన రైతులు
విద్యుత్ కోతలతో అల్లాడిపోతున్న రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విద్యుత్ సిబ్బందిని నిర్బంధించి ఆందోళనకు దిగిన ఘటన అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలో జరిగింది. పి.సిద్ధరాంపురం, కూడేరు మండలం ఎం.ఎం.పల్లిలో రైతులు వేల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. రోజూ ఆరు గంటలు కూడా విద్యుత్ సరఫరా లేకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయా మండలాల రైతులు నిన్న పి.సిద్ధరాంపురంలోని విద్యుత్ సబ్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. 

సబ్‌స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందిని గదిలో నిర్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు సబ్‌స్టేషన్‌కు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు వచ్చి కోతల్లేకుండా విద్యుత్‌ను సరఫరా చేస్తామని హామీ ఇవ్వడంతో శాంతించిన రైతులు సిబ్బందిని విడిచిపెట్టారు.


More Telugu News