బిల్లు చెల్లించమన్న ఆసుపత్రి.. మర్డర్లు చేసే నన్నే బిల్లు అడుగుతావా? అంటూ వైసీపీ నేత అనుచరుడు చికెన్‌బాషా వీరంగం

  • రక్తస్రావం, నొప్పులతో ఆసుపత్రిలో చేరిన బాషా కుమార్తె
  • చికిత్స చేసి డబ్బులు చెల్లించమన్న ఆసుపత్రి
  • అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడి
  • ఫిర్యాదు చేసిన ఆసుపత్రి యాజమాన్యం
  • రాజీ కోసం సిద్ధార్థరెడ్డి అనుచరుల ప్రయత్నాలు
బిల్లు చెల్లించమన్నందుకు అనుచరులతో కలిసి ఆసుపత్రి సిబ్బందిపైనే దాడికి దిగారు వైసీసీ నేత, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అనుచరుడు చికెన్‌బాషా. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నంద్యాల జిల్లా ముచ్చుమర్రికి చెందిన బాషా కుమార్తె ఐదు నెలల గర్భిణి. రక్తస్రావం, నొప్పులతో బాధపడుతుండడంతో నందికొట్కూరులోని సుజాత ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స అనంతరం బిల్లు చెల్లించాలని సిబ్బంది బాషాను కోరారు. 

ఆ మాట వినగానే ఆగ్రహంతో ఊగిపోయిన బాషా అనుచరులతో కలిసి సిబ్బందిపై దాడికి దిగారు. మర్డర్లు చేయడమే వృత్తిగా పెట్టుకున్న నన్నే డబ్బులు అడుగుతారా? మీ అంతు చూస్తా? అని హెచ్చరించారు. తాను బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మనిషినని, తలచుకుంటే సాయంత్రానికల్లా ఇక్కడ ఆసుపత్రి ఉండదని వార్నింగ్ ఇచ్చారని ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. 

ఆయితే, ఫిర్యాదు పత్రంపై సంతకం లేదని, ఇందుకోసం పోలీసులను ఆసుపత్రికి పంపినా సంతకం చేయలేదని నందికొట్కూరు ఎస్సై తెలిపారు. మరోవైపు, నిన్న సాయంత్రం సిద్ధార్థరెడ్డి అనుచరులు, యాదవ సంఘం నాయకులు ఆసుపత్రికి వచ్చి రాజీ కోసం ప్రయత్నించినట్టు తెలుస్తోంది.


More Telugu News