ఉక్రెయిన్ లో రష్యా సేనల నరమేధానికి మాక్సర్ ఉపగ్రహాలే సాక్ష్యాలు!

  • బుచా నగరంలో రష్యా దారుణాలు
  • గుట్టలుగా పడివున్న శవాలు
  • ఇప్పటిదాకా బుకాయించిన రష్యా
  • ఫొటోలు విడుదల చేసిన మాక్సర్
ఉక్రెయిన్ లోని బుచా నగరంలో శవాల గుట్టలు దర్శనమివ్వడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. రష్యా సేనల దాడుల్లో మరణించిన వారికి సామూహిక ఖననం చేస్తున్న దృశ్యాలు, ఏమీ తెలియని పిల్లవాడు తల్లి సమాధి దగ్గర అమాయకంగా నిల్చుని ఉండడం, ఓ శునకం యజమాని మృతదేహాన్ని అంటిపెట్టుకుని ఉండడం, చేతులు వెనక్కి విరిచి కట్టేసి కాల్చిచంపిన దృశ్యాలు ప్రపంచదేశాలను కదిలించి వేశాయి. 

అయితే, తమ దళాలు మార్చి 30 నాటికే ఉక్రెయిన్ నుంచి వెనుదిరిగాయని, తాము మారణహోమానికి పాల్పడలేదని రష్యా ఇప్పటివరకు బుకాయిస్తూ వస్తోంది. అయితే, మాక్సర్ సంస్థకు చెందిన ఉపగ్రహాలు చిత్రీకరించిన దృశ్యాలు రష్యన్ సేనల దారుణాలకు సాక్ష్యాలుగా నిలిచాయి. మాక్సర్ సంస్థ ఉపగ్రహాలు భూమిపై ఒక మీటరు విస్తీర్ణంలోని చిత్రాలను కూడా అత్యంత నాణ్యతతో అందిస్తాయి. బుచా నగర వీధుల్లో విసిరేసినట్టుగా ఉన్న శవాలు, ఓ చర్చి మైదానం వద్ద సామూహిక ఖననం కోసం తవ్విన కందకం మాక్సర్ ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనిపించాయి. 

ఈ ఉపగ్రహాలు మార్చి 10 నుంచి వివిధ తేదీల్లో తీసిన ఫొటోలు, రష్యా సేనల అఘాయిత్యాలను బయటపెడుతున్నాయి. మాక్సర్ శాటిలైట్ ఇమేజిలు బయటికి రావడంతో పాశ్చాత్య దేశాలు భగ్గుమంటున్నాయి. అటు, ఐక్యరాజ్యసమితి, హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థలు కూడా దీనిపై తీవ్రంగా స్పందించాయి. బుచా నరమేధంపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరుతున్నాయి. ఉక్రెయిన్ లో రష్యా యుద్ధ నేరాలకు పాల్పడిందన్న ఆరోపణలకు తాజా ఫొటోలు మరింత బలం చేకూర్చుతున్నాయి.


More Telugu News