తెలంగాణ సీఎస్‌కు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేసిన హైకోర్టు

  • టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో ఈడీ పిటిష‌న్‌
  • కాల్ డేటా, డిజిట‌ల్ రికార్డుల కోసం హైకోర్టును ఆశ్ర‌యించిన ఈడీ
  • రికార్డులు ఇవ్వాలంటూ గ‌తంలోనే హైకోర్టు ఆదేశం
  • ఆ ఆదేశాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని మ‌రోమారు ఈడీ పిటిష‌న్‌
  • ఇది కోర్టు ధిక్క‌ర‌ణ కింద‌కే వ‌స్తుంద‌ని వాద‌న‌
తెలంగాణ ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్‌తో పాటు తెలంగాణ ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ స‌ర్ఫ‌రాజ్ అహ్మ‌ద్‌ల‌కు గురువారం తెలంగాణ హైకోర్టు కోర్టు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లోగా ఈ నోటీసుల‌కు స‌మాధానం ఇవ్వాల‌ని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. టాలీవుడ్ డ్ర‌గ్స్ కేసులో రికార్డుల‌ను ఇవ్వ‌డం లేదంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) దాఖ‌లు చేసిన పిటిష‌న్ విచార‌ణ సంద‌ర్భంగా సోమేశ్‌, స‌ర్ఫ‌రాజ్‌ల‌కు ధిక్క‌ర‌ణ నోటీసులు జారీ అయ్యాయి.

టాలీవుడ్ ప్ర‌ముఖులు డ్ర‌గ్స్ వాడారంటూ దాఖ‌లైన కేసును గ‌తంలో ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ విచారించిన సంగ‌తి తెలిసిందే. తాజాగా ఈ వ్య‌వ‌హారంలో మ‌నీ ల్యాండ‌రింగ్ కూడా జ‌రిగింద‌న్న ప్రాథ‌మిక స‌మాచారంతో ఈడీ కూడా కేసు న‌మోదు చేసింది. విచార‌ణ‌లో భాగంగా నాడు ద‌ర్యాప్తు చేసిన బృందం సేక‌రించిన నిందితుల కాల్ డేటా, డిజిట‌ల్ రికార్డులు అంద‌జేయాల‌ని తెలంగాణ స‌ర్కారుకు ఈడీ లేఖ రాసింది. ప్ర‌భుత్వం నుంచి స్పంద‌న లేక‌పోవ‌డంతో ఈడీ అధికారులు నేరుగా హైకోర్టును ఆశ్ర‌యించిన సంగ‌తి తెలిసిందే.

ఈడీ అభ్య‌ర్థ‌న‌కు సానుకూలంగా స్పందించిన హైకోర్టు... ఈడీ కోరిన వివ‌రాల‌న్నీ అందించాలంటూ గతంలోనే తెలంగాణ స‌ర్కారుకు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలు జారీ చేసినా ప్ర‌భుత్వం నుంచి త‌మ‌కు ఇంకా వివ‌రాలు అంద‌లేద‌ని తాజాగా మరోమారు హైకోర్టును ఆశ్ర‌యించిన ఈడీ... తెలంగాణ ప్రభుత్వం కోర్టు ధిక్క‌ర‌ణ‌కు పాల్ప‌డింద‌ని ఆరోపించింది. ఈ వాద‌న‌ల‌ను విన్న హైకోర్టు సీఎస్‌తో పాటు ఎక్సైజ్ శాఖ డైరెక్ట‌ర్ కు నోటీసులు జారీ చేసింది. తదుప‌రి విచార‌ణ‌ను ఈ నెల 25కు వాయిదా వేసింది.


More Telugu News