అందరికన్నా నేనే ఎక్కువ షాక్ అయ్యా.. విధ్వంసకర ఇన్నింగ్స్ పై ప్యాట్ కమిన్స్

  • నిన్న ముంబైని చెడుగుడు ఆడేసిన కమిన్స్ 
  • బంతి మంచి చోట పడితే బాదేద్దామనుకున్నానని వెల్లడి
  • చిన్న బౌండరీని క్యాష్ చేసుకున్నట్టు వ్యాఖ్య
గెలుస్తాం.. అని ధీమాగా సాగుతున్న ముంబైకి విధ్వంసకర ఇన్నింగ్స్ తో కోల్ కతా ఆల్ రౌండర్ ప్యాట్ కమిన్స్ భారీ షాకే ఇచ్చాడు. ఐపీఎల్ లో కేఎల్ రాహుల్ నమోదు చేసిన ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేసిన కమిన్స్ పై అందరూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. తన ఇన్నింగ్స్ పై కమిన్స్ తాజాగా స్పందించాడు. 

అసలు తానే నమ్మలేకపోతున్నానని వ్యాఖ్యానించాడు. ఆ ఇన్నింగ్స్ తనను ఆశ్చర్యానికి గురి చేసిందన్నాడు. ఇంకా చెప్పాలంటే అందరికన్నా తానే ఎక్కువ షాక్ కు గురయ్యానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఏదైతేనేం తాను బాగా ఆడినందుకు ఆనందంగా ఉందన్నాడు. 

మంచి చోట బంతి పడితే స్టాండ్స్ కు పంపాలని ముందే ఫిక్సయ్యానని అతడు చెప్పాడు. ఈ సీజన్ లో ఫస్ట్ గేమ్ లోనే ఇలా ఆడడం మజా ఇచ్చిందన్నాడు. బౌండరీ చాలా చిన్నగా ఉందని, దాన్ని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నించానని వివరించాడు. మెగా వేలం తర్వాత జట్టులో భారీ మార్పులు చోటు చేసుకున్నాయన్నాడు. 

ముంబై నిర్దేశించిన 161 పరుగులు లక్ష్యాన్ని నిన్న కోల్ కతా నాలుగు ఓవర్లు మిగిలుండగానే ఛేదించిన సంగతి తెలిసిందే. కమిన్స్ 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ మార్కును అందుకుని ఫాస్టెస్ట్ ఫిఫ్టీ రికార్డును సమం చేశాడు.


More Telugu News