చెన్నై, ముంబై జట్లకు ఏమైంది..? పాయింట్ల పట్టికలో అట్టడుగున!

  • వరుసగా మూడు మ్యాచుల్లోనూ ఇరు జట్లకు ఓటమి
  • కీలక ఆటగాళ్లు దూరంతో మారిన తలరాత
  • గాయాల వల్ల కొందరు దూరం
  • మారిన జట్ల సమతూకం
ఐపీఎల్ చరిత్రలో అత్యంత విజయవంతమైన జట్లు మొదటి సారి గడ్డు పరిస్థితులను చూస్తున్నాయి. ముంబై ఇండియన్స్ ఐదు సార్లు టైటిల్ గెలిచిన జట్టు. చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు సార్లు టైటిల్ నెగ్గిన టీమ్. కానీ, ఇదంతా గతమెంతో ఘనం అనుకోవాలేమో..! 

ఐపీఎల్ 2022 సీజన్ లో ఇవి ఇప్పటి వరకు చెరో మూడు మ్యాచ్ లు ఆడగా.. ఒక్క విజయాన్ని కూడా చూడలేకపోయాయి. పాయింట్ల పట్టికలో సన్ రైజర్స్ తర్వాత 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉంటే, 8వ స్థానంలో సీఎస్కే ఉంది. కాకపోతే సన్ రైజర్స్ రెండు మ్యాచులే ఇప్పటికి ఆడింది. మూడో మ్యాచులో సన్ రైజర్స్ (అత్యంత విఫల చరిత్ర ఉన్నది) విజయం దక్కించుకుంటే ముంబై ఇండియన్స్, సీఎస్కే కంటే ముందుకు వెళ్లిపోతుంది. 

రెండు కొత్త జట్ల రాక ఐపీఎల్ జట్ల స్వరూపాలు మారిపోవడానికి దారితీసిందని చెప్పుకోవాలి. మెగా వేలానికి ముందు ప్రతి టీమ్ మూడు లేదా నలుగురు ఆటగాళ్లను ఉంచుకుని మిగిలిన వారిని విడుదల చేయాలని ఐపీఎల్ యాజమాన్యం కోరింది. దీంతో ముంబై ఇండియన్స్, సీఎస్కే తమకు ముఖ్యమైన ఆటగాళ్లను కొందరిని ఉంచుకోలేని పరిస్థితిని ఎదుర్కొన్నాయి. తర్వాత వేలంలోనూ కావాల్సిన వారిని దక్కించుకోలేకపోయాయి. 

ఇక తీసుకున్న ఆటగాళ్లలోనూ కొందరు గాయాలతో దూరం కావడం ముంబై, చెన్నై జట్లకు శాపంగా మారింది. ముంబై ఇండియన్స్ పాండ్యా సోదరులను కోల్పోయింది. సూర్యకుమార్ యాదవ్ గాయం వల్ల మొదటి రెండు మ్యాచులకు దూరం అయ్యాడు. గాయం వల్లే జోఫ్రా ఆర్చర్ ఈ సీజన్ కు అందుబాటులో ఉండడం లేదు. 

చెన్నై జట్టుకు గత సీజన్ లో టైటిల్ విజయంలో కీలకంగా పనిచేసిన దీపక్ చాహర్ గాయం కారణంగా దూరమయ్యాడు. వేలంలో రూ.14 కోట్లు ధారపోసి మరీ అతడ్ని సీఎస్కే కొనుగోలు చేసింది. కానీ, అతడు మొదటి మూడు మ్యాచులకు అందుబాటులోకి రాలేదు. సీఎస్కేకు ఎన్నో విజయాల్లో కీలకంగా పనిచేసిన స్టార్ ఓపెనర్ ఫాప్ డూప్లెసిస్ ను వేలంలో కొనుగోలు చేయలేదు. దాంతో ఓపెనింగ్ భాగస్వామ్యం దెబ్బతిన్నది. 

2021 టైటిల్ విజయంలో ప్రధాన పాత్రధారి, ఆరెంజ్ క్యాప్ విన్నర్ రుతురాజ్ గైక్వాడ్ ఫామ్ లోకి రాలేదు. దీనికి తోడు ధోనీ సారథ్యం వదిలేయడం, ఆ బాధ్యతలు జడేజా ఎత్తుకోవడం తెలిసిందే. ఇవన్నీ ఆయా జట్ల ఆటతీరుపై ప్రభావం చూపిస్తున్నాయి.


More Telugu News