ప్రపంచంలోనే ఇది తొలి ప్రయత్నం: రామ్‌గోపాల్ వర్మ

  • పెద్ద హీరోలతో సినిమాలు తీసే ఓపిక, సామర్థ్యం తనకు లేవన్న వర్మ 
  • ఎంతలో సినిమా చేశాననే ఆలోచిస్తానని వ్యాఖ్య 
  • తనను ఆసక్తికి గురిచేసిన అంశాన్నే తెరకెక్కిస్తానని వెల్లడి 
  • ‘మా ఇష్టం’ మూవీలో క్రైమ్ డ్రామా ఉందన్న వర్మ 
ప్రముఖ దర్శకుడు రామ‌గోపాల్ వర్మ రూపొందించిన ‘మా ఇష్టం’ సినిమా ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో నిన్న హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడిన వర్మ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్ద హీరోలతో, పెద్ద బడ్జెట్‌తో సినిమాలు చేసే ఓపిక, సామర్థ్యం, తపన తనకు లేవని కుండబద్దలు కొట్టారు. 

తనను ఆసక్తికి గురిచేసే అంశంతోనే సినిమా తీస్తానని, దానిని ఎంతమంది చూశారు? ఎంత బాగుంది? అన్న దానికంటే ఎంతలో తీశాననే విషయాన్ని మాత్రమే ఆలోచిస్తానని అన్నారు. ఎంత వచ్చిందన్న అంశమే లాభాలను నిర్ణయిస్తుందన్నారు. తాను తీసిన సినిమాలన్నీ తనకు లాభాలు తెచ్చిపెట్టాయని, అందుకే తాను సినిమాలు చేయగలుగుతున్నానని అన్నారు.

స్వలింగ సంపర్కం గురించి మన దేశంలో ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నారని, స్వలింగ సంపర్కులు కూడా మనుషులేనని అన్నారు. ఈ అంశంపై ఇప్పటికే కొన్ని సినిమాలు వచ్చాయని అన్నారు. కాబట్టి తాను ఆంశం జోలికి పోకుండా ఇద్దరు అమ్మాయిలు స్వలింగ సంపర్కులు ఎందుకయ్యారన్న చర్చ లేకుండా వారి చుట్టూ ఓ క్రైమ్ డ్రామాను అల్లుతూ ‘మా ఇష్టం’ సినిమాను చేశానని అన్నారు. ఇందులో యాక్షన్ అంశాలు ఎక్కువగా ఉంటాయని, ఇద్దరమ్మాయిల మధ్య ఓ రొమాంటిక్ డ్యూయెట్‌ను కూడా చిత్రీకరించానని, ఇలా తీయడం ప్రపంచంలోనే ఇది తొలి ప్రయత్నమని వర్మ వివరించారు. 

తన సినిమాలు చూసి వర్మ దిగజారిపోయాడని అనుకునే వారు కూడా ఉంటారని అన్నారు. అయితే, అలాంటి వాళ్లంతా పుట్టినప్పటి నుంచి బావిలో ఉన్నవారేనని విమర్శించారు. కాగా, ఆయన రూపొందించిన ‘కొండా’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే, మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కించిన మరో సినిమా జూన్‌లో విడుదల కానుంది. ‘దహనం’ అనే వెబ్ సిరీస్ పూర్తి కాగా, మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి.


More Telugu News