కేసీఆర్ ప్రభుత్వం, సీఎస్ పై గవర్నర్ తమిళిసై తీవ్ర వ్యాఖ్యలు

  • రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
  • గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో ఎలాంటి వివాదం లేదు
  • ప్రొటోకాల్ గురించి సీఎస్ కు తెలియదా? అన్న గవర్నర్ 
ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ గవర్నర్ తమిళిసై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగాన్ని, వ్యవస్థలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకంలో వివాదం లేదని... సేవా రంగం నుంచి ఒక వ్యక్తి పేరును ప్రభుత్వం తనకు ప్రతిపాదించిందని... అయితే ఆ వ్యక్తి ఎలాంటి సేవ చేయలేదని తాను భావించానని, అందుకే ఆయన అభ్యర్థిత్వాన్ని ఓకే చేయలేదని చెప్పారు. తన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి స్పష్టంగా చెప్పానని అన్నారు. 

ఇదే సమయంలో చీఫ్ సెక్రటరీపై గవర్నర్ మండిపడ్డారు. ప్రొటోకాల్ గురించి సీఎస్ కు తెలియదా? అని ప్రశ్నించారు. ఒక వ్యక్తిని కాకుండా, ఒక వ్యవస్థను పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. తనకు ఎలాంటి ఇగోలు లేవని అన్నారు. తాను వివాదాస్పద వ్యక్తిని కాదని, బాధ్యత కలిగిన వ్యక్తినని చెప్పారు. సీఎం కానీ, మంత్రులు కానీ ఎప్పుడైనా రాజ్ భవన్ కు రావచ్చని అన్నారు. 

ఈరోజు ప్రధాని మోదీని తమిళిసై కలిశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడానికి తాను ప్రధానిని కలవలేదని చెప్పారు. రాష్ట్రంలోని గిరిజన సమస్యలను ప్రధాని దృష్టికి తీసుకెళ్లానని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సదుపాయాలను పెంచాలని కోరానని చెప్పారు. మరోవైపు, రాష్ట్రంలోని రాజకీయ పరిణామాలను ప్రధాని దృష్టికి ఆమె తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.


More Telugu News