ప్ర‌ధాని మోదీతో ఎన్సీపీ చీఫ్ ప‌వార్ భేటీ

  • 20 నిమిషాలు మాట్లాడుకున్న ఇద్ద‌రు నేత‌లు
  • 'మహా' నేతలపై ఈడీ దాడుల నేపథ్యంలో భేటీ 
  • వారిద్దరూ పెద్ద నాయకులన్న అజిత్ పవార్  
జాతీయ రాజ‌కీయాల్లో రోజుకో కొత్త ప‌రిణామం చోటుచేసుకుంటోంది. ఇందులో భాగంగా నేష‌న‌లిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) అధినేత‌, కేంద్ర మాజీ మంత్రి శ‌ర‌ద్ ప‌వార్ బుధ‌వారం ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీతో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. దాదాపుగా 20 నిమిషాల పాటు సాగిన ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

ఇటీవలి కాలంలో మహారాష్ట్రలోని ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ (ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) జరుపుతున్న దాడుల నేపథ్యంలో ప్రధానిని పవార్ కలుసుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీరి సమావేశంపై ఇరు పార్టీలు ఇంకా స్పందించలేదు. 

ఈ నేపథ్యంలో ఎన్సీపీ ముఖ్య నేత, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మాట్లాడుతూ, ఈ సమావేశంపై తన వద్ద సమాచారం ఏదీ లేదని, అటువంటప్పుడు తాను దీనిపై స్పందించలేనని వ్యాఖ్యానించారు. అయితే, దేశ ప్రధానిని, ఓ జాతీయ పార్టీ నాయకుడు కలవడంలో తప్పులేదని, వారిద్దరూ పెద్ద నాయకులనీ, వారు దేని గురించి చర్చించుకున్నారో తనకు తెలియదని అజిత్ పవార్ అన్నారు.     

 


More Telugu News