అందుకే.. సచినే నాకు ఎప్పటికీ స్ఫూర్తి: రోహిత్ శర్మ

  • లెజెండ్ పై టీమిండియా కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • చిన్నప్పటి నుంచి ఆయన ఆట చూసి పెరిగానని కామెంట్
  • మైదానం బయటా, లోపలా సచిన్ ను ఫాలో అవుతానని వెల్లడి
టీమిండియా, ముంబై ఇండియన్స్ సారథి రోహిత్ శర్మ.. క్రికెట్ గాడ్ గా పిలుచుకునే సచిన్ టెండూల్కర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తాను క్రికెట్ ఆడడానికి సచినే స్ఫూర్తి అని స్పష్టం చేశాడు. ‘‘నాకు అప్పటికీ..ఇప్పటికీ.. ఎప్పటికీ క్రికెట్ స్ఫూర్తి సచిన్ టెండూల్కరే. నేను 8, 9 ఏళ్లున్నప్పుడు సచిన్ ఆటను చూశాను. అప్పట్నుంచి ఆయన అందుకున్న శిఖరాలను కళ్లారా చూశాను. క్రికెట్ విషయంలో మరెవరూ అంతటి శిఖరాలను అందుకోలేరని నేను అనుకుంటున్నాను. దాదాపు 25 ఏళ్ల పాటు తన భుజాలపై క్రికెట్ బాధ్యతలను మోశారు. అది అంత తేలికేం కాదు’’ అని రోహిత్ అన్నాడు. 

అందుకే తనకు క్రికెట్ లో సచినే స్ఫూర్తి అని, అన్ని విషయాల్లోనూ ఆయన్నే అనుసరిస్తానని చెప్పాడు. కెరీర్ లో అతడు సాధించిన విజయాలు, మైదానం లోపల, మైదానం వెలుపల సచిన్ జీవితమే తనకు అన్ని విధాలుగా స్ఫూర్తి అన్నాడు. ఒక్క క్రికెట్ లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలో కూడా సచిన్ ఎంతో వినయంతో వుంటాడన్నాడు. వ్యక్తిగతంగా చాలా నెమ్మదస్తుడన్నారు. ఎన్నో ఘనతలు సాధించి, పైకి ఎదిగాక అలా అణకువగా ఉండడం సాధ్యం కానిపని అని, కానీ, ఎదిగినా ఒదిగి ఉండడం సచిన్ వ్యక్తిత్వంలోని గొప్ప విషయమని పేర్కొన్నాడు.


More Telugu News