ఇంటర్ విద్యార్థి అదృశ్యంపై నాలుగేళ్లుగా వీడని మిస్టరీ.. తాగిన మైకంలో నిజం కక్కేసి దొరికిపోయిన నిందితుడు!

  • క్రికెట్ ఆడే విషయంలో గొడవ
  • స్నేహితుడి మెడకు తాడు బిగించి చంపేసిన వైనం
  • వినియోగంలో లేని సెప్టిక్ ట్యాంకులో మృతదేహాన్ని పడేసిన నిందితులు
  • ఏడాది తర్వాత మళ్లీ వచ్చి కళేబరాన్ని తీసుకెళ్లి కాలువలోకి విసిరేసిన వైనం
క్రికెట్ ఆడే విషయంలో తలెత్తిన వివాదంలో స్నేహితుడిని దారుణంగా హత్యచేసిన నిందితులు ఆపై మృతదేహం చిక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మిస్టరీగా మారిన ఈ కేసు చిక్కుముడి నాలుగేళ్ల తర్వాత నిందితుల్లో ఒకరు మద్యం మత్తులో బయటపెట్టేయడంతో వెలుగులోకి వచ్చింది. 

ప్రస్తుత తూర్పుగోదావరి జిల్లా చాగల్లులో 2018లో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. వేలివెన్నులో ఇంటర్ చదువుతున్న చాగల్లుకు చెందిన శ్రీహర్ష దీపావళి పండుగను పురస్కరించుకుని దారవరంలోని తాతయ్య శ్యాంసన్ ఇంటికి వచ్చాడు. 

ఈ క్రమంలో అంతకుముందే క్రికెట్‌లో తనకు పరిచయమైన నిర్మాణ కూలీలు షేక్ రషీద్, ఆదిత్య, మునీంద్రతో కలిసి ఆడుకునేందుకు నిడదవోలు జూనియర్ కళాశాలకు వెళ్లాడు. ఆడుకుంటున్న క్రమంలో వీరిమధ్య వివాదం తలెత్తింది. దీంతో ముగ్గురూ కలిసి శ్రీహర్ష మెడకు తాడు బిగించి చంపేశారు. ఆపై మృతదేహాన్ని వినియోగంలో లేని సెప్టిక్ ట్యాంకులో పడేశారు. ఏడాది తర్వాత మళ్లీ కాలేజీకి వెళ్లి సెప్టిక్ ట్యాంకులోంచి కళేబరాన్ని తీసి నిడదవోలు రైల్వే గేటు సమీపంలోని కాలువలో పడేశారు. 

మరోవైపు, శ్రీహర్ష కనిపించడం లేదంటూ అతడి తండ్రి రత్నకుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు శ్రీహర్ష కోసం ఎంతగా గాలించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో శ్రీహర్ష అదృశ్యం మిస్టరీగా మిగిలిపోయింది. 

తాజాగా నిందితుల్లో ఒకడైన రషీద్ తాగిన మైకంలో స్నేహితులను హెచ్చరిస్తూ తనతో జాగ్రత్తగా ఉండాలని, తాను ఇది వరకే ఓ హత్య చేశానని వార్నింగ్ ఇచ్చాడు. ఈ విషయం కాస్తా పోలీసుల చెవిన పడడంతో రషీద్‌ను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. నిజం ఒప్పుకోవడంతో అతడిని అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరు నిందితులైన ఆదిత్య, మునీంద్ర పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


More Telugu News