మహారాష్ట్ర కంటే చిన్నదైన ఏపీకి మూడు రాజధానులా?: శరద్ పవార్ ఆశ్చర్యం

  • హస్తినలో శరద్ పవార్‌ను కలిసిన రైతు ప్రతినిధి బృందం
  • జగన్ హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారా? అని పవార్ ప్రశ్న
  • ఉన్న రాజధాని నుంచి పాలించలేని వ్యక్తి మూడు రాజధానులు నిర్మిస్తాడా? అని విస్మయం
  • అమరావతికి మద్దతు ఇస్తామని హామీ
ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ స్పందించారు. ‘ఏపీకి మూడు రాజధానులా?’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కేంద్రమాజీ మంత్రి రేణుకా చౌదరి, ఏపీ మహిళా కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మ ఆధ్వర్యంలో నిన్న అమరావతి రైతుల ప్రతినిధి బృందం హస్తినలో శరద్ పవార్‌ను కలిసి సమస్యలు వివరించింది. 

ఈ సందర్భంగా శరద్ పవార్ మాట్లాడుతూ.. ఏపీ కంటే పెద్దదైన మహారాష్ట్రలో రెండు రాజధానులు ఉన్నప్పటికీ, విదర్భలో రాజధాని ఉన్న ప్రాంతం అభివృద్ధి చెందలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు అంటున్న సీఎం జగన్ హైదరాబాద్ నుంచి పాలిస్తున్నారా? అని రైతులను ప్రశ్నించారు. 

దీనికి రైతులు బదులిస్తూ అమరావతిలో గత ప్రభుత్వం కట్టిన శాసనసభ, సచివాలయం నుంచే ఆయన పనిచేస్తున్నారని బదులిచ్చారు. అమరావతి నిర్మాణంపై అప్పట్లో చంద్రబాబు తనకు వివరించారని, ఆ ప్రణాళిక ఎంతో అద్భుతంగా ఉందని పవార్ గుర్తు చేసుకున్నారు. కొత్త రాష్ట్రం అద్భుతమైన రాజధానిని నిర్మించుకుంటోందని చాలా సంతోషించామని చెప్పారు. 

ఉన్న రాజధాని నుంచే పనిచేయలేని వ్యక్తి మూడు రాజధానులు ఎలా నిర్మిస్తారని ఆయన సందేహం వ్యక్తం చేశారు. అమరావతే ఏపీ రాజధాని అన్న కోర్టు తీర్పును కూడా జగన్ పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా రైతులు శరద్ పవార్ దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నేతలు అమరావతికే మద్దతు తెలుపుతున్నా కేంద్రం నుంచి సరైన మద్దతు లభించడం లేదని రైతు ప్రతినిధులు వాపోయారు. దీంతో అమరావతికి తమ పార్టీ తరపున పార్లమెంటులో మద్దతు ఇస్తామని పవార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.


More Telugu News