కేటీఆర్ ట్వీట్‌పై ఘాటుగా స్పందించిన కర్ణాటక సీఎం బొమ్మై

  • ‘ఖాతాబుక్’ను హైదరాబాద్‌కు ఆహ్వానించిన కేటీఆర్
  • రాజకీయంగా దుమారం రేపుతున్న ట్వీట్ 
  • బెంగళూరు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్షిస్తోందన్న సీఎం
  • ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళం కొలవడం నేర్చుకోవాలన్న కర్ణాటక బీజేపీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇటీవల చేసిన ట్వీట్‌పై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. కేటీఆర్ ట్వీట్ హాస్యాస్పదమన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది బెంగళూరుకు తరలివచ్చి ఇక్కడ పరిశ్రమలు స్థాపిస్తుంటారని అన్నారు. స్టార్టప్‌లు, యూనికార్న్ సంస్థలు ఇక్కడ పెద్ద సంఖ్యలో ఉన్నాయని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అత్యధికంగా ఆకర్షిస్తున్న నగరం బెంగళూరేనని గుర్తు చేశారు. మూడేళ్లుగా రాష్ట్రం ఎంతో ఆర్థిక ప్రగతి సాధిస్తోందని అన్నారు.

మరోవైపు, కర్ణాటక బీజేపీ కూడా కేటీఆర్ ట్వీట్‌పై స్పందించింది. తెలంగాణలో ఏం జరుగుతోందో ప్రపంచానికి తెలుసని, ఆకాశాన్ని కొలిచే ముందు అంగుళాన్ని కొలవడం నేర్చుకోవాలంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. మన పళ్లెంలో ఈగ పడినా పట్టించుకోని వారు పక్క వారి పళ్లెంలో పడిన ఈగ గురించి మాట్లాడడం సహజమని ఎద్దేవా చేసింది. 

ఉనికి కోల్పోతున్న కేసీఆర్ సర్కారు అభివృద్ధి విషయంలో బెంగళూరుతో సవాలు చేయడం హాస్యాస్పదమని పేర్కొంది. విదేశీ పెట్టుబడులు, ఐటీ-బీటీ వంటి అన్ని రంగాల్లోనూ పెట్టుబడిదారులకు బెంగళూరు స్వర్గధామమని పేర్కొంది. పొరుగు రాష్ట్రాలపై ఇలాంటి దురహంకార పోటీ తగదని కేటీఆర్‌కు హితవు పలికింది.

బెంగ‌ళూరులో ఏర్పాటైన ప‌రిశ్ర‌మ‌లు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఇటీవల ఖాతాబుక్ సీఈఓ ర‌వీష్ న‌రేశ్ చేసిన ఆవేద‌నా భ‌రిత ట్వీట్ కు తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ సిలికాన్ వ్యాలీలో అసౌక‌ర్యంగా ఉంటే తెలంగాణకు వచ్చేయాలని ఆహ్వానించారు. 

అద్భుత‌మైన మౌలిక వ‌స‌తుల‌తో పాటు సామాజికంగానూ మెరుగైన ప‌రిస్థితులు హైదరాబాద్ సొంతమ‌ని తెలిపారు. రాక‌పోక‌ల‌కు ఈజీగా ఉండేలా ఎయిర్‌పోర్టు కూడా హైద‌రాబాద్ సొంత‌మ‌ని కేటీఆర్ తెలిపారు. ఇక త‌మ ప్ర‌భుత్వం ఆవిష్కరణ, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత వృద్ధి అనే మూడు అంశాల ప్రాతిప‌దిక‌గా సాగుతోంద‌ని కేటీఆర్ గుర్తు చేశారు. కేటీఆర్ చేసిన ఈ ట్వీట్ అప్పుడే రాజకీయంగా దుమారం రేపింది.


More Telugu News