పలు దేశాల్లో రాయబార కార్యాలయాలను మూసివేసిన శ్రీలంక

  • ఆర్థికపతనంలోకి జారుకున్న శ్రీలంక
  • దేశంలో అదుపుతప్పుతున్న పరిస్థితులు
  • ఎంపీలు, మంత్రుల ఇళ్ల వద్ద మోహరించిన ఆందోళనకారులు
  • అధ్యక్ష వ్యవస్థ రద్దు చేయాలంటున్న విపక్షనేత
ఒకప్పుడు అత్యంత రమణీయమైన దేశంగా పేరుగాంచిన శ్రీలంక ఇప్పుడు అత్యంత దయనీయ స్థితిలోకి జారుకుంది. పర్యాటకం, ఎగుమతులతో ఉన్నంతలో మెరుగైన జీవనం గడిపిన లంకేయులు...  కరోనా సంక్షోభం, తీవ్ర ఆహార కొరత, ద్రవ్యోల్బణం వంటి సమస్యలతో తీవ్రంగా సతమతమవుతున్నారు. ప్రస్తుతం అక్కడ ప్రభుత్వం ఉన్నదన్నమాటే కానీ, ప్రజలకు చేయగలిగిన సాయమంటూ ఏమీలేదు. ఈ నేపథ్యంలో, వివిధ దేశాల్లోని తమ రాయబార కార్యాలయాలను శ్రీలంక మూసివేసింది. నార్వే, ఇరాక్, ఆస్ట్రేలియా దేశాల్లో దౌత్య కార్యాలయాలకు తాత్కాలికంగా మూతవేసింది. 

దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స దేశంలో అత్యవసర పరిస్థితిని విధించినా, ఎవరూ ఖాతరు చేయడంలేదు. విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన వారు వీధుల్లోకి వచ్చి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలు పలుచోట్ల హింసాత్మక రూపు దాల్చుతున్నాయి. నిరసనకారులు మంత్రులు, మాజీ మంత్రులు, ఎంపీల ఇళ్ల వద్ద మోహరించడంతో ఉద్రిక్తతలు ఏర్పడ్డాయి. పోలీసుల హెచ్చరికలను సైతం శ్రీలంక ప్రజలు పట్టించుకోవడంలేదు. 

దేశంలో నెలకొన్న సంక్షోభంపై విపక్ష నేత సాజిత్ ప్రేమదాస స్పందించారు. శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థ వల్లే ఇలాంటి దుష్పరిణామాలు తలెత్తాయని, అధికారాలన్నీ అధ్యక్షుడి వద్దే కేంద్రీకృతం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు. శ్రీలంకలో అధ్యక్ష వ్యవస్థను రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News