నిమిషానికి 700 సంతూర్ సబ్బుల త‌యారీ.. విప్రో యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

  • మ‌హేశ్వ‌రంలో కొత్త యూనిట్‌ను ప్రారంభించిన విప్రో
  • అజిమ్ ప్రేమ్‌జీతో క‌లిసి యూనిట్‌ను ప్రారంభించిన కేటీఆర్‌
  • రూ.300 కోట్ల‌తో సంతూర్ స‌బ్బుల త‌యారీ యూనిట్‌
  • 900 మందికి ఉపాధి, 90 శాతం మేర స్థానికులకే అవ‌కాశం
తెలంగాణ‌లో విప్రో సంస్థ త‌న త‌యారీ యూనిట్‌ను మంగ‌ళ‌వారం ప్రారంభించింది. రూ.300 కోట్లతో ఏర్పాటైన ఈ యూనిట్‌ను విప్రో సంస్థ హైద‌రాబాద్ శివారులోని మ‌హేశ్వ‌రంలో ఏర్పాటు చేసింది. ఈ యూనిట్‌ను విప్రో ఫౌండ‌ర్ చైర్మ‌న్ అజిమ్ ప్రేమ్‌జీతో క‌లిసి తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ కాసేప‌టి క్రితం లాంఛ‌నంగా ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా శాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి కూడా పాలుపంచుకున్నారు.

మ‌హేశ్వ‌రంలో అత్యాధునిక టెక్నాల‌జీతో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌లో సంతూర్ స‌బ్బుల‌తో పాటు సాఫ్ట్ ట‌చ్ ఫ్యాబ్రిక్ కండిష‌న‌ర్‌ల‌ను విప్రో ఉత్ప‌త్తి చేయ‌నుంది. ఈ యూనిట్‌కు నిమిషానికి ఏకంగా 700 సంతూర్ సబ్బులను త‌యారు చేసే సామ‌ర్థ్యం ఉంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు. దేశంలో ఇంత వేగంగా స‌బ్బుల ఉత్ప‌త్తిని చేప‌ట్ట‌నుండ‌టం ఇదే తొలిసారని కూడా ఆ కంపెనీ ప్ర‌క‌టించింది. ఈ యూనిట్ ద్వారా 900 మందికి ఉపాధి ల‌భించ‌నుంద‌ని, అందులో 90 శాతం మంది స్థానికులేన‌ని కేటీఆర్ తెలిపారు.


More Telugu News