ఒక్కో జిల్లా ఒక్కో ఆణిముత్యంలా అభివృద్ధి చెందుతుంది: విజయసాయిరెడ్డి

  • నిన్నటి నుంచి ఏపీలో 26 కొత్త జిల్లాలు
  • జిల్లాల విభజన శాస్త్రీయంగా జరిగిందన్న విజయసాయి
  • వారిని సీఎం చిరస్మరణీయులుగా చేశారని ప్రశంస 
  • ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు స్వాగతించారని వ్యాఖ్య 
ఏపీలో ఏప్రిల్ 4 నుంచి 26 జిల్లాల పాలన అమల్లోకి రావడం తెలిసిందే. నిన్న జరిగిన ఓ కార్యక్రమంలో సీఎం జగన్ లాంఛనంగా కొత్త జిల్లాలను ప్రారంభించారు. అయితే, జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. 

జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అత్యంత శాస్త్రీయంగా జరిగిందని స్పష్టం చేశారు. 26 జిల్లాలు ఒక్కో ఆణిముత్యంలా అభివృద్ధిని నమోదు చేస్తాయని ఉద్ఘాటించారు. నాలుగు జిల్లాలకు ఎన్టీఆర్, అల్లూరి, అన్నమయ్య, శ్రీసత్యసాయి పేరిట నామకరణం చేయడం ద్వారా సీఎం జగన్ వారిని చిరస్మరణీయులుగా చేశారని విజయసాయి కొనియాడారు. కొత్త జిల్లాలపై ఎవరెంత ఏడ్చినా ఐదున్నర కోట్ల మంది ప్రజలు స్వాగతించారని వ్యాఖ్యానించారు.


More Telugu News