నేనే గవర్నర్ అయితే ఆత్మహత్య చేసుకునేవాడిని: సీపీఐ నారాయణ కీలక వ్యాఖ్యలు

  • వైసీపీ పాల‌న‌పై నిప్పులు చెరిగిన నారాయ‌ణ‌
  • జ‌గ‌న్ నిర్ణ‌యాల‌కు గ‌వ‌ర్న‌ర్ గుడ్డిగా ఆమోద‌మంటూ విమ‌ర్శ‌
  • వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీకి 23 సీట్లు కూడా రావ‌ని వ్యాఖ్య‌
ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పాల‌న‌, రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్‌లే టార్గెట్‌గా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చినా సీఎం జగన్‌కు బానిస బతుకు అవసరమా? అంటూ ఆయ‌న‌ ప్రశ్నించారు. బీజేపీ కనుసన్నల్లో రాష్ట్ర ప్రభుత్వ పాలన సాగుతోందని నారాయ‌ణ‌ విమర్శించారు. చేతిలో అధికారం ఉందని జగన్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారా? అని కూడా ఆయ‌న‌ ప్రశ్నించారు. 

జ‌గ‌న్ ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. వాటన్నింటికీ గవర్నర్ ఆమోదం ఎలా తెలుపుతారని నారాయ‌ణ నిల‌దీశారు. కేంద్రం కూడా ఆమోదించబట్టే.. గవర్నర్ ఇలాంటి నిర్ణయాలపై సంతకాలు చేస్తున్నారని ఆయ‌న వ్యాఖ్యానించారు. తానే గవర్నర్‌గా ఉంటే ఆత్మహత్య చేసుకునేవాడిని అని నారాయ‌ణ‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 23 సీట్లు అయినా వచ్చాయి.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు అవి కూడా రావని నారాయ‌ణ జోస్యం చెప్పారు. పేద, మధ్య తరగతి ప్రజలకు జగన్ కరెంట్ షాక్ ఇచ్చారన్న నారాయ‌ణ‌.. జిల్లాల పునర్విభజన ప్రజాస్వామ్య పద్ధతిలో జరగలేదని ఆరోపించారు. 

జగన్ పాలనపై వామపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాయని నారాయణ స్పష్టం చేశారు. సీపీఐ జాతీయ మహాసభలు కేరళలో అక్టోబర్ 14 నుంచి జ‌ర‌గ‌నున్నాయ‌ని చెప్పిన నారాయ‌ణ.. ఎర్ర జెండాల ప్రాముఖ్యత పెరగాలంటే సీపీఐ, సీపీఎం కలవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.. సీపీఐ మ‌హాసభలో ఈ అంశాన్ని చర్చిస్తామని చెప్పారు. సీపీఎం, సీపీఐ కలిసేలా తీర్మానం చేస్తామని నారాయ‌ణ వ్యాఖ్యానించారు.


More Telugu News