శ్రీలంకకు కొత్త ఆర్థికమంత్రి... దశ మారేనా...?

  • శ్రీలంకలో తీవ్ర ఆర్థిక సంక్షోభం
  • ఆకాశాన్నంటేలా ద్రవ్యోల్బణం
  • మంత్రివర్గం రాజీనామా
  • సొంత సోదరుడ్ని తప్పించిన దేశాధ్యక్షుడు గొటబాయ
  • కొత్త ఆర్థికమంత్రిగా అలీ సబ్రీ
సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఏదైనా మంత్రదండం ఉంటే తప్ప, ఇప్పట్లో సాధారణ పరిస్థితులు నెలకొనడం అసాధ్యంగా కనిపిస్తోంది. ఏ వస్తువు కొనాలన్నా ఆకాశాన్నంటిన ధరలు, అసలు నిత్యావసర వస్తువులే సరిగా అందుబాటులో లేని దుస్థితి, భగ్గుమంటున్న పెట్రోల్, డీజిల్ ధరలు, ఏ పని చేయాలన్నా నిధుల లేమి, తీవ్ర ఆహార కొరత... ఇదీ శ్రీలంక ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సంక్షోభం. 

ఇలాంటి పరిస్థితుల్లో దేశానికి కొత్త ఆర్థికమంత్రి వచ్చారు. ఇప్పటిదాకా ఆర్థికమంత్రిగా ఉన్న బాసిల్ రాజపక్సను దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్స తొలగించారు. బాసిల్ రాజపక్స... సాక్షాత్తు దేశాధ్యక్షుడు గొటబాయకు సోదరుడే. అయినప్పటికీ దేశ ఆర్థిక పరిస్థితి మరీ విషమిస్తున్న నేపథ్యంలో, తన సోదరుడ్ని ఉపేక్షించలేకపోయారు. బాసిల్ ను తప్పించి కొత్త ఆర్థికమంత్రిగా అలీ సబ్రీకి బాధ్యతలు అప్పగించారు. 

అలీ సబ్రీ ఇప్పటిదాకా న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. మరి కొత్త ఆర్థికమంత్రి రాకతో శ్రీలంక దశ మారుతుందా అంటే సవాలక్ష సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. ద్రవ్యోల్బణం రాకెట్లా దూసుకుపోతున్న తరుణంలో అలీ సబ్రీ ఏంచేయగలరన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. మరి కొన్ని వారాల పాటు శ్రీలంకలో ఇదే తరహా పరిస్థితులు నెలకొంటే పెద్ద ఎత్తున ప్రజలు భారత్ కు శరణార్థులుగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి. 

శ్రీలంకలో ఎక్కడ చూసినా ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రభుత్వాజ్ఞలను ధిక్కరించి ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. విపక్షాలు కూడా ప్రభుత్వంలో చేరాలని దేశాధ్యక్షుడు ఆహ్వానం పలికినా, వారు ప్రభుత్వంలోకి వచ్చి ఏంచేస్తారంటూ శ్రీలంక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. 

ప్రజాగ్రహం ఉప్పెనలా మారడానికి సోషల్ మీడియా దోహదపడుతుందన్న అనుమానంతో లంక ప్రభుత్వం నిన్న 15 గంటల పాటు సోషల్ మీడియా సైట్లపై నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో, శ్రీలంక ఆశలన్నీ అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ప్యాకేజీపైనే ఉన్నాయి. ఈ ప్యాకేజీ అయినా లంకకు ఉపశమనం కలిగిస్తుందేమో చూడాలి.


More Telugu News