రాంగోపాల్ వ‌ర్మ‌కు షాకిచ్చిన పీవీఆర్, ఐనాక్స్‌

  • లెస్బియ‌నిజం నేప‌థ్యంలో వ‌ర్మ చిత్రం
  • ఈ నెల 8న విడుద‌ల కానున్న డేంజ‌ర‌స్‌
  • ప్ర‌ద‌ర్శించ‌లేమ‌న్న పీవీఆర్‌, ఐనాక్స్‌
  • స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అవ‌మానించిన‌ట్టేన‌న్న వ‌ర్మ‌
ప్రముఖ సినీ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు మంగ‌ళ‌వారం షాక్ త‌గిలింది. వ‌ర్మ తాజా చిత్రం డేంజ‌ర‌స్‌ను ప్ర‌ద‌ర్శించేందుకు పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించాయి. ఈ విష‌యాన్ని స్వ‌యంగా వ‌ర్మ‌నే కాసేప‌టి క్రితం ట్విట్ట‌ర్ వేదిక‌గా తెలిపారు. ఇద్ద‌రు మ‌హిళ‌ల మ‌ధ్య స్వ‌లింగ సంపర్కం నేప‌థ్యంలో డేంజ‌ర‌స్ చిత్రాన్ని వ‌ర్మ రూపొందించారు. 

నైనా గంగూలీ, అప్స‌రా రాణి ప్ర‌ధాన పాత్ర‌లుగా తెర‌కెక్కిన ఈ చిత్రం ఈ నెల 8న విడుదల కానుంది. ఈ నేప‌థ్యంలో ఈ సినిమాను ప్ర‌ద‌ర్శించ‌లేమంటూ పీవీఆర్ సినిమాస్‌, ఐనాక్స్ సినిమాస్ తేల్చిచెప్పేశాయి. త‌న సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి అనుమ‌తి ల‌భించిన అంశాన్ని ప్ర‌స్తావించిన వ‌ర్మ‌... ఈ రెండు సినిమా థియేట‌ర్లు త‌న సినిమా ప్ర‌ద‌ర్శ‌న‌కు తిర‌స్క‌రించి స్వ‌లింగ సంప‌ర్కుల‌ను అవ‌మానించాయంటూ వ‌ర్మ ఆవేద‌న వ్య‌క్తం చేశారు.


More Telugu News