హృదయ విదారకం: ‘మేం చనిపోతే..’ అంటూ ఉక్రెయిన్ లో పిల్లలవీపులపై వివరాలు రాస్తున్న తల్లులు

  • వైరల్ గా మారుతున్న ఫొటోలు
  • మూడు రోజుల క్రితం ఓ తల్లి ఆవేదన
  • ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఆందోళన
ఉక్రెయిన్ ప్రజలపై రష్యా సైనికులు అత్యంత కిరాతకాలకు పాల్పడుతున్నారు. పదేళ్ల వయసున్న ఆడపిల్లలపైనా వాళ్లు అత్యాచారాలకు తెగబడుతున్నారని నిన్న ఉక్రెయిన్ మహిళా ఎంపీ వాసిలెంకో తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు.. మహిళల ఒంటిపై స్వస్తిక్ ముద్రలతో వాతలు పెడుతున్నారనీ ఆరోపించారు. వాటికి సంబంధించిన ఫొటోలను ఆమె ట్వీట్ చేశారు.  

సామాన్య ప్రజలనూ టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారని, చంపేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. వీధుల్లో ఎక్కడ చూసినా శవాలే కనిపిస్తున్నాయంటున్నారు. ఈ క్రమంలోనే తల్లులు తామెప్పుడు చనిపోతామో తెలియక.. తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. తాము చనిపోతే పిల్లల భవిష్యత్ ఏమైపోతుందోనని సతమతమవుతున్నారు. 

ఈ క్రమంలోనే కొందరు తల్లులు తమ పిల్లల వీపులపై కుటుంబ వివరాలు రాస్తున్నారు. ఒకవేళ తాము చనిపోతే ఆ వివరాల ఆధారంగా పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వేడుకుంటున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అనాస్తాసియా లపాటినా అనే జర్నలిస్ట్ ఓ బాలిక ఫొటోను ట్విట్టర్ లో పోస్ట్ చేయడంతో అదికాస్తా వైరల్ గా మారింది. 

బాలిక తల్లి సాషా మకోవియ్ తన ఇన్ స్టాగ్రామ్ లో మూడు రోజుల క్రితం ఈ ఫొటోను పోస్ట్ చేసింది. తాము చనిపోతే తమ బిడ్డను రక్షించి జాగ్రత్తగా చూసుకోవాలంటూ చిన్నారి వీపుపై రాసింది. ప్రస్తుతం తాము అంతా సురక్షితంగానే ఉన్నామని, అయితే, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.


More Telugu News