ఐఐటీ కాన్పూర్ కు రూ.100 కోట్ల భారీ విరాళమిచ్చిన పూర్వ విద్యార్థి!

  • ఇండిగో సహ వ్యవస్థాపకుడి వితరణ 
  • స్కూల్ ఆఫ్  మెడికల్ సైన్సెస్ కు భారీ విరాళం  
  • ఐఐటీ డైరెక్టర్ కు అందజేసిన రాకేశ్ గంగ్వాల్
విద్యాబుద్ధులు నేర్పి అత్యున్నత స్థానంలో నిలిపినందుకు ఐఐటీ కాన్పూర్ కు ఓ పూర్వ విద్యార్థి అపూర్వ కానుకనిచ్చారు. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఆయన ఎవరో కాదు.. విమానయాన సంస్థ ఇండిగో సహ వ్యవస్థాపకుడు రాకేశ్ గంగ్వాల్. 

తాను చదువుకున్న విద్యా సంస్థకు ఏదో ఒకటి చేయాలన్న సంకల్పంతో ఆయన తన కుటుంబంతో కలిసి రూ.100 కోట్లను విరాళంగా ఇచ్చారు. సంస్థ డైరెక్టర్ అభయ్ కరాందికర్ కు విరాళం చెక్కును అందజేశారు. ఐఐటీ కాన్పూర్ లో స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ ఏర్పాటు కోసం రాకేశ్ ఈ విరాళమిచ్చారని అభయ్ కరాందికర్ ప్రకటించారు. 

తమకు ఇంత టైం కేటాయించి వ్యక్తిగతంగా వచ్చి విరాళమిచ్చిన రాకేశ్ గంగ్వాల్, ఆయన భార్య శోభా గంగ్వాల్, వారి కూతురు పరూల్ గంగ్వాల్ కు రుణపడి ఉంటామన్నారు. విరాళానికి సంబంధించి ముంబైలో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. కాగా, ఆయన ఉదారతకు, వితరణకు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయన్ను వేనోళ్ల కొనియాడుతున్నారు. ఇవ్వడం ఎలాగో భారతీయులను చూసి నేర్చుకోవాలని అంటున్నారు.  

కాగా, ఐఐటీ కాన్పూర్ క్యాంపస్ లో 500 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించేందుకు సంస్థ కసరత్తులు చేస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాదే స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాకేశ్ గంగ్వాల్ ఇంత పెద్ద మొత్తాన్ని విరాళంగా ఇవ్వడంతో అందరూ ప్రశంసిస్తున్నారు. 

ప్రపంచం చాలా వేగంగా మారుతోందని సాంకేతిక ఆధునికతను అందిపుచ్చుకుంటూ వైద్య రంగం పురోగమిస్తోందని రాకేశ్ గంగ్వాల్ అన్నారు. వైద్య రంగంలో పెను మార్పులకు కారణమయ్యేలా ఐఐటీ కాన్పూర్ లోని స్కూల్ ఆఫ్ మెడిసిన్ లో ఆవిష్కరణలకు పెద్ద పీట వేయనున్నారని ఆయన చెప్పారు. అందులో తానూ భాగమవుతున్నందుకు ఆనందంగా ఉందన్నారు.


More Telugu News