‘వరకట్నంతో లాభాలు’ అంటూ నర్సింగ్ పుస్తకాల్లో పాఠం.. విమర్శల వెల్లువ!

  • మహారాష్ట్ర బీఎస్సీ నర్సింగ్ కోర్సులో పాఠం 
  • సెకండియర్ సోషియాలజీలో ఒక చాప్టర్
  • అందంగా లేని అమ్మాయిలకు కట్నం వరమంటూ లెసన్
  • వెంటనే తొలగించాలంటూ విద్యావేత్తల డిమాండ్
సమాజంలో వరకట్న దురాచారం పోవాలని పోరాటాలు జరుగుతున్న రోజులివి. అదనపు కట్నం తేవాలంటూ ఇల్లాళ్లపై ఇప్పటికీ అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ఇల్లాలిని అత్తింటివారు చంపడమో లేదంటే వారి వేధింపులు తాళలేక ఆ ఇల్లాలే ఆత్మహత్య చేసుకోవడమో జరుగుతోంది. ఇన్ని జరుగుతున్నా అవేవీ పట్టనట్టు.. వరకట్నంతో బోలెడు లాభాలంటూ పుస్తకాల్లో పాఠాలు రాస్తున్నారు. వాటిని విద్యార్థులకు బోధిస్తున్నారు. 

అవును, మహారాష్ట్రలో అచ్చంగా ఇదే జరిగింది. బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది సోషియాలజీ పుస్తకాల్లో వరకట్నంతో లాభాల పేరిట పాఠం రాశారు. ఈ పుస్తకాన్ని టి.కె. ఇంద్రాణీ అనే సీనియర్ రచయిత రాయగా.. జైపీ బ్రదర్స్ మెడికల్ పబ్లిషర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ ప్రచురించింది. 

కొందరు నర్సింగ్ విద్యార్థినులు ఈ వ్యవహారాన్ని బయటపెట్టడంతో వెలుగులోకి వచ్చింది. దీంతో చాలా మంది సదరు పాఠంపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. సమాజం పురోగమిస్తుంటే.. పుస్తకాల్లో ఇలాంటి పాఠాలు పెడుతూ మరింత వెనక్కు నెట్టేస్తారా? అంటూ సామాజిక కార్యకర్తలు, విద్యావేత్తలు నిలదీస్తున్నారు. 

ఇంతకీ ఏముంది?

 ‘‘కట్నమంటే ఎందుకో అందరూ వింతగా, విచిత్రంగా చూస్తుంటారు. చాలా మంది తల్లిదండ్రులు తమ ఇంటి ఆడపడుచులకు కట్నం ఇచ్చి పంపించేందుకు బదులుగా.. తన కొడుకు కోసం కట్నం తీసుకుంటూ ఉంటారు. తన కొడుకుకు కట్నం తీసుకురావడం ద్వారా తమ ఇంటి ఆడపడుచులకు పెళ్లి చేసి పంపించాలని భావిస్తుంటారు’’ అంటూ చిత్రాల ద్వారా పాఠంలో విశ్లేషించారు. 

అంతేకాదు.. అందంగాలేని అమ్మాయిలకు కట్నం వరమని, వారికి త్వరగా పెళ్లి అయ్యేందుకు కట్నం ఎంతో దోహదపడుతుందని పాఠంలో పేర్కొన్నారు. ఈ పాఠాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, పుస్తకాల నుంచి తొలగించాలని విద్యావేత్తలు డిమాండ్ చేశారు. ఇటు భారత నర్సింగ్ మండలి (ఐఎన్ సీ) దీనిపై అసహనం వ్యక్తం చేసింది. ఈ పాఠం సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా ఉందంటూ వ్యాఖ్యానించింది. ఇలాంటి పాఠాలు చట్టాలు, నిబంధనలకు విరుద్ధమని తెలిపింది. తాము కొన్ని నర్సింగ్ ప్రోగ్రామ్ లకే సిలబస్ ను సిఫార్సు చేస్తామని, కట్నం గురించి తాము సిలబస్ లో పేర్కొనలేదని వివరణ ఇచ్చింది.


More Telugu News