ఇండియాకు పాఠాలు చెప్పాలని మేము భావించడం లేదు: జర్మనీ రాయబారి వాల్టర్

  • రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోవడం భారత్ ఇష్టం
  • దిగుమతులు తగ్గించుకోవాలని భారత్ కు మేము చెప్పం
  • పొరుగు దేశంపై పుతిన్ దాడి చేస్తాడని మేము భావించలేదు
అగ్రరాజ్యం అమెరికా చేస్తున్న హెచ్చరికలను సైతం పక్కన పెట్టి రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యాపై తాము విధిస్తున్న ఆంక్షలను ప్రపంచ దేశాలు అనుసరించాలని అమెరికా హెచ్చరిస్తున్నా భారత్ పట్టించుకోవడం లేదు. 

ఈ నేపథ్యంలో భారత్ లో జర్మనీ రాయబారి వాల్టర్ జే లిండ్నర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు దిగుమతులను తగ్గించుకోవాలని భారత్ కు బోధించాలని జర్మనీ అనుకోవడం లేదని ఆయన అన్నారు. ఏం చేయాలనేది భారత్ ఇష్టమని చెప్పారు. రష్యా చమురు, బొగ్గుపై పలు యూరప్ దేశాలు ఆధారపడి ఉన్నాయని... ఇందులో దాయడానికి ఏమీ లేదని తెలిపారు. 

ఒక పొరుగు దేశంపై పుతిన్ దాడి చేస్తారని తాము ఎప్పుడూ భావించలేదని వాల్టర్ అన్నారు. ఇప్పటికే రష్యా నుంచి తాము దిగుమతులను గణనీయంగా తగ్గించుకున్నామని చెప్పారు. ప్రతి దేశానికి ఒక గతం ఉంటుందని, పలు విషయాల్లో ఇతర దేశాలపై ఆధారపడే పరిస్థితులు ఉంటాయని అన్నారు. పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టుగా ఇతర దేశాలతో సంబంధాలు ఉంటాయని చెప్పారు. రష్యాపై ఆంక్షలు ఉన్నాయని.. ఆ ఆంక్షలు యుద్ధాన్ని ఆపగలిగితే మంచిదేనని చెప్పారు. ఏ దేశాధిపతి అయినా పుతిన్ తో మాట్లాడి ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపగలిగితే చాలా మందిదని అన్నారు.


More Telugu News