విద్యార్థిని కొట్టినందుకు ఇద్దరు టీచర్లకు మూడేళ్ల జైలు శిక్ష 

  • మంచినీళ్లు, టాయిలెట్ కు తరచుగా వెళ్లడంతో చిన్నారిపై ఆగ్రహం
  • కాళ్లపై కర్రలతో విచక్షణారహితంగా దాడి
  • వాతలు తేలడంతో తల్లిదండ్రుల ఫిర్యాదు 
  • క్రమశిక్షణ చర్యలకు సైతం కోర్టు ఆదేశం
అకారణంగా ఒక విద్యార్థిని దండించిన ఇద్దరు టీచర్లకు జైలుశిక్ష పడింది. గుజరాత్ లోని మిర్జాపూర్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టు ముందుకు ఈ కేసు విచారణకు వచ్చింది. ఐదేళ్ల చిన్నారి కిండర్ గార్టెన్ స్కూల్లో చదువుతున్నాడు. ఓ రోజు ఇంటికి వెళ్లిన తర్వాత అతడు తనను టీచర్లు కాళ్లపై తీవ్రంగా కొట్టారని, తోసివేశారని తల్లికి చెప్పుకున్నాడు. కాళ్లపై వాతలను చూపించాడు.

ఇంతకీ అతడు ఏదైనా పెద్ద తప్పు చేసి ఉంటాడనుకుంటే పొరపాటే. నీళ్లు తాగేందుకు వెళ్లాలని, టాయిలెట్ కు వెళ్లాలని తరచుగా అడుగుతున్నాడన్న కోపంతో ఆ బాలుడుని ఇద్దరు టీచర్లు దండించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు టీచర్లు తరుణ పర్బతియా (36), నజ్మా షేక్ (47)పై పోలీసులు కేసు నమోదు చేశారు. వాదనలు విన్న అనంతరం వేర్వేరు సెక్షన్ల కింద టీచర్లు ఇద్దరికీ మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ మేజిస్ట్రేట్ తీర్పు చెప్పారు. టీచర్లపై క్రమశిక్షణ చర్యలకు సైతం ఆదేశించారు.


More Telugu News