మా జోలికొస్తే అణ్వాయుధాలతో అంతు చూస్తాం: కిమ్ సోదరి హెచ్చరిక

  • శత్రు సైన్యాన్ని మట్టుబెడతామన్న కిమ్ యో జాంగ్ 
  • యుద్ధానికి ఉత్తర కొరియా వ్యతిరేకమని వ్యాఖ్య 
  • దక్షిణ కొరియా అదే ఎంచుకుంటే చూస్తూ కూర్చోమంటూ వార్నింగ్ 
ఉత్తర కొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ సోదరి కిమ్ యో జాంగ్ దక్షిణ కొరియాను ఉద్దేశించి గట్టి హెచ్చరిక జారీ చేశారు. తమపై దాడికి దిగితే అణ్వాయుధాలతో దక్షిణ కొరియా సైన్యం అంతు చూస్తామని ప్రకటించారు. కిమ్ తర్వాత రెండో అత్యంత శక్తిమంతురాలిగా కిమ్ యో జాంగ్ ఉన్నారు. ఉత్తర కొరియా యుద్ధాన్ని వ్యతిరేకిస్తుందని ఆమె అన్నారు. అయితే, ఒకవేళ దక్షిణ కొరియా సైనిక దాడిని లేదా ముందస్తు దాడిని ఎంచుకుంటే కనుక అణ్వాయుధాలతో దాడి చేస్తామని ఆమె ప్రకటించారు. 

ఉత్తర కొరియా ప్రభుత్వంలో సీనియర్ గా కిమ్ యో జాంగ్ వ్యవహరిస్తున్నారు.  దక్షిణ కొరియా రక్షణ మంత్రి సుహ్ వుక్ ఇటీవల ఉత్తర కొరియాపై దాడుల గురించి వ్యాఖ్యానించడం పెద్ద తప్పిదంగా ఆమె పేర్కొన్నారు. గత శుక్రవారం దక్షిణ కొరియా రక్షణ మంత్రి మాట్లాడుతూ.. ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగిస్తుందన్న స్పష్టమైన సంకేతాలు ఉంటే.. ఆ దేశంలోని ఏ లక్ష్యాన్ని అయినా కచ్చితంగా, వేగంగా కొట్టి పడే క్షిపణులు తమ వద్ద ఉన్నాయని ప్రకటించారు. 

ఈ నేపథ్యంలోనే కిమ్ యో జాంగ్ తీవ్రంగా స్పందించారు. ‘‘అణ్వాయుధ శక్తి అన్నది శత్రుదేశాలను నిరోధించేందుకే. కానీ, సాయుధ పోరాటం అనివార్యమైతే కనుక శత్రు దేశం సైనిక దళాలను అణ్వాయుధాలు తుడిచిపెట్టేస్తాయి’’ అని ఆమె పేర్కొన్నారు.


More Telugu News