రాహుల్‌తో టీకాంగ్రెస్ నేత‌ల భేటీ.. ముంద‌స్తు టికెట్ల ప్ర‌క‌ట‌న‌పై కోమ‌టిరెడ్డి ఫైర్‌

  • ఢిల్లీలో టీ కాంగ్ నేత‌ల‌తో రాహుల్ భేటీ
  • ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌
  • ముంద‌స్తుగా టికెట్ల ప్ర‌క‌ట‌న‌పై కోమ‌టిరెడ్డి ప్ర‌స్తావ‌న‌
  • అలాంటిదేమీ లేద‌న్న మాణిక్కం ఠాగూర్‌
తెలంగాణ కాంగ్రెస్ నేత‌ల‌తో ఆ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ సోమ‌వారం ఢిల్లీలో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మ‌య్యారు. ఈ భేటీ కోసం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స‌హా టీ కాంగ్రెస్‌కు చెందిన చాలా మంది కీల‌క నేత‌లు ఢిల్లీకి వెళ్లిన సంగ‌తి తెలిసిందే. అనుకున్న‌ట్లుగానే సోమ‌వారం సాయంత్రం రాహుల్ గాంధీతో వీరంతా భేటీ అయ్యారు. భేటీలో ప‌లు అంశాల‌పై కీల‌క చ‌ర్చ జ‌రిగింది.

చ‌ర్చ‌లో భాగంగా భువ‌నగిరి ఎంపీ కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి ఓ కీల‌క అంశాన్ని ప్ర‌స్తావించారు. ఎన్నిక‌ల‌కు ఇంకా చాలా స‌మ‌య‌మే ఉన్నా... ముందుగానే అభ్యర్థుల‌ను ఎలా ప్ర‌క‌టిస్తార‌ని ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా ఆయ‌న పెద్ద‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గానికి విజ‌య‌ర‌మ‌ణారావు అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసిన వైనాన్ని ప్ర‌స్తావించారు. మిగిలిన వారి లాగే తాను కూడా ముందుగానే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించాలా? అంటూ ఆయ‌న పార్టీ కీల‌క నేత‌ల‌ను ప్ర‌శ్నించారు. 

ఈ సంద‌ర్భంగా వెనువెంట‌నే అందుకున్న పార్టీ తెలంగాణ వ్య‌వ‌హారాల ఇంచార్జీ మాణిక్కం ఠాగూర్‌..అలాంటిదేమీ లేద‌ని స‌ర్ది చెప్పారు. ఇప్ప‌టిదాకా ఏ ఒక్కరికి కూడా టికెట్ ప్ర‌క‌టించ‌లేద‌ని చెప్పిన ఠాగూర్‌.. పార్టీ అధిష్ఠాన‌మే అభ్య‌ర్థుల‌ను ఖ‌రారు చేస్తుంద‌ని వెల్ల‌డించారు. దీంతో కోమ‌టిరెడ్డి శాంతించారు.


More Telugu News