ఐపీఎల్ పై నా వ్యాఖ్యలను వక్రీకరించారు: పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా

  • ఐపీఎల్ ను పీఎస్ఎల్ అధిగమిస్తుందన్న రమీజ్
  • పీఎస్ఎల్ లో వేలం నిర్వహిస్తామని వెల్లడి
  • ఐపీఎల్ కు ఎవరు వస్తారో చూస్తామని వ్యాఖ్యలు
  • రమీజ్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు
  • తాజాగా వివరణ ఇచ్చిన పీసీబీ చీఫ్
ఇటీవల ఐపీఎల్ ప్రారంభానికి ముందు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్ వర్గాల నుంచి విమర్శలు వచ్చాయి. పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో వచ్చే సీజన్ నుంచి ఆటగాళ్ల కోసం వేలం ప్రక్రియ నిర్వహిస్తామని, ఐపీఎల్ కు దీటుగా పీఎస్ఎల్ ను నిలుపుతామని రమీజ్ రాజా అన్నారు. అంతేకాదు, తాము నిర్వహించే వేలంతో పీఎస్ఎల్ ను కాదనుకుని ఐపీఎల్ కు ఎవరు వెళతారో చూస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశారు. పీఎస్ఎల్ కాసుల వర్షం కురిపించడం ఖాయమని అన్నారు. 

అయితే తన వ్యాఖ్యల పట్ల విమర్శలు రావడంతో రమీజ్ రాజా స్పందించారు. తన వ్యాఖ్యలను వక్రీకరించారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. భారత్ ఆర్థిక వ్యవస్థ ఏ స్థాయిలో ఉందో, అదే సమయంలో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి ఏంటో తనకు తెలుసని వ్యాఖ్యానించారు. పీఎస్ఎల్ ను మరింత మెరుగుపర్చేందుకు తమ వద్ద కొన్ని ప్రణాళికలు ఉన్నాయని రమీజ్ రాజా వెల్లడించారు. ఈ క్రమంలోనే వేలం ప్రక్రియను తీసుకువద్దామని అనుకుంటున్నామని, కానీ తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరించారు.


More Telugu News