తెలంగాణకు చల్లటి కబురు.. మూడు రోజుల పాటు వర్ష సూచన!

  • మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు ద్రోణి
  • 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
  • హైదరాబాద్ లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం
తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలు, తట్టుకోలేని ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. మధ్యాహ్న సమయాల్లో అత్యవసరమైతే తప్ప ఇళ్లలోంచి బయటకు రావొద్దని అధికారులు హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురును అందించింది. 

రాష్ట్రంలో రేపటి నుంచి మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెదక్, సంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, నిజామాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ తదితర 17 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరఠ్వాడా నుంచి కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉన్న ద్రోణి కారణంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. హైదరాబాద్ సహా మరికొన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతం అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. 6 నుంచి 10 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.


More Telugu News