పాల‌కుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్తే ఎలా?: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప‌వన్ ఆగ్ర‌హం

  • ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణించ‌కుండా జిల్లాల విభ‌జ‌న ఎలా చేస్తారు?
  • లోప‌భూయిష్టంగా ఏపీలో జిల్లాల విభ‌జ‌న 
  • డిమాండ్ ఉన్న ప్రాంతాల‌పై అధ్య‌య‌నం చేయ‌లేదు
  • గిరిజ‌నుల‌కు స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయన్న పవన్ 
ఏపీలో ఈ రోజు కొత్త జిల్లాలను ప్రారంభించిన విష‌యం తెలిసిందే. దీనిపై జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ స్పందిస్తూ ఏపీ ప్ర‌భుత్వ తీరుపై మండిప‌డ్డారు. ప్ర‌జాభిప్రాయాన్ని ప‌రిగ‌ణించ‌కుండా జిల్లాల విభ‌జ‌న ఎలా చేస్తారని ఆయ‌న నిల‌దీశారు. పాల‌కుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్తే రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌రిస్థితి ఏమిటని ఆయ‌న ప్ర‌శ్నించారు.

లోప‌భూయిష్టంగా ఏపీలో జిల్లాల విభ‌జ‌న చేశార‌ని ఆయ‌న అన్నారు. కొత్త జిల్లాల డిమాండ్ ఉన్న ప్రాంతాల‌పై ప్ర‌భుత్వం అధ్య‌య‌నం కూడా చేయించ‌లేద‌ని ఆయ‌న మండ‌పడ్డారు. ఏపీలోని ముంపు మండ‌లాల గిరిజ‌నుల‌కు ఈ తీరుతో స‌మ‌స్య‌లు ఎదుర‌వుతాయ‌ని ఆయ‌న చెప్పారు. పేద‌లు జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే చాలా దూరం ప్ర‌యాణించాల్సిన అవ‌స‌రం ఉండ‌కూడ‌ద‌ని ఆయ‌న అన్నారు. 

గతంలో కాకినాడ కేంద్రంగా ఉన్న స‌మ‌యంలోనూ ఇటువంటి ఇబ్బందులే త‌లెత్తాయ‌ని ఆయ‌న చెప్పారు. పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత కూడా ఇబ్బందులు త‌ప్ప‌డం లేవ‌ని అన్నారు. రంపచోడ‌వ‌రం కేంద్రంగా ఉండాల‌న్న గిరిజ‌నుల అభిప్రాయాల‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న విమర్శించారు. 

మ‌రోవైపు, రాయ‌ల‌సీమ‌లోనూ ప్ర‌జ‌ల అభిప్రాయాన్ని ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. మ‌ద‌న‌ప‌ల్లె, హిందూపురం, మార్కాపురాన్ని కేంద్రాలుగా చేయాల‌ని డిమాండ్లు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. ఆయా అంశాల్లో ప్ర‌జ‌లు చేస్తోన్న ఆందోళ‌న‌ల‌కు త‌మ పార్టీ అండ‌గా ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌జ‌లకు అన్ని ర‌కాలుగా సౌక‌ర్యాలు అందుబాటులో ఉండ‌డ‌మే ల‌క్ష్యంగా పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చేయాల‌ని, ఆ మేర‌కు ప్ర‌భుత్వం దిగివ‌చ్చేలా పోరాడే బాధ్య‌త‌ను తాము తీసుకుంటామ‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌క‌టించారు.


More Telugu News