శ్రీలంక మాదిరే కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు.. ప్రధాని ముందు అధికారుల ఆందోళన

  • తెలంగాణ, ఏపీలో ఉచిత పథకాలు ఆచరణలో అసాధ్యం
  • ఉచిత విద్యుత్తుతో ఆర్థిక భారం
  • కీలకమైన విద్య, వైద్యానికి కేటాయించలేని పరిస్థితి
  • వీటికి పరిష్కారం కొనుగొనాల్సి ఉంది
  • ప్రధానికి వివరించిన సీనియర్ అధికారులు
ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న ప్రజాకర్షక పథకాలు, ఉచిత తాయిలాల హామీలపై సీనియర్ అధికారులు ప్రధాని ముందు ఆందోళన వ్యక్తం చేశారు. వీటికి చెక్ పెట్టకపోతే మన దేశంలో కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు శ్రీలంక, గ్రీస్ మాదిరే దిగజారొచ్చని ప్రధాని ముందు ప్రస్తావించారు. 

సీనియర్ అధికారులతో ప్రధాని నిర్వహించిన సమావేశం ఇందుకు వేదికగా నిలిచింది. అన్ని కీలక శాఖల ముఖ్య అధికారులు దీనికి హాజరయ్యారు. కొన్ని రాష్ట్రాలలో రాజకీయ పార్టీలు ప్రకటించిన పథకాలు ఆర్థికంగా ఆచరణ సాధ్యం కానివిగా వారు పేర్కొన్నారు. రాష్ట్రాలలో కార్యదర్శుల స్థాయిలో పని చేసి కేంద్ర సర్వీసుల్లోకి వచ్చిన అధికారులు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొన్ని రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి అనిశ్చితిలో ఉందని, సమాఖ్య వ్యవస్థలో అవి భాగం కాకపోయి ఉంటే ఇప్పటికే ఆర్థికంగా పతనమై ఉండేవన్న అభిప్రాయాన్ని ప్రధాని వద్ద వ్యక్తం చేశారు.

పంజాబ్, ఢిల్లీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రకటించిన పథకాలు ఆర్థికంగా సాధ్యం కానివిగా అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంలో కొన్ని పరిష్కారాలను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. కొన్ని పార్టీలు ఆఫర్ చేస్తున్న ఉచిత విద్యుత్తు రాష్ట్రాలపై ఆర్థిక భారాన్ని మోపుతున్నట్టు చెప్పారు. ఈ తరహా ఉచితాల వల్ల కీలకమైన ఆరోగ్యం, విద్య వంటి రంగాలకు నిధుల కేటాయింపులు చేసే వెసులుబాటు ఉండడం లేదన్నారు. 



More Telugu News