చాలా సంతోషంగా ఉంది.. చంద్రబాబు చేయలేని పనిని జగన్ చేసి చూపించారు: లక్ష్మీపార్వతి

  • ఎన్టీఆర్ బాల్యమంతా విజయవాడలోనే గడిచిపోయింది
  • విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టడం సంతోషకరం
  • ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోయేందుకు చంద్రబాబు ఒక్క పని కూడా చేయలేదు
ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించారు. మరోవైపు విజయవాడ కేంద్రంగా ఏర్పడిన జిల్లాకు మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ పేరు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకురాలు, తెలుగు అకాడమీ ఛైర్ పర్సన్ లక్ష్మీపార్వతి సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

లక్ష్మీపార్వతి ఈ ఉదయం ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కు వచ్చారు. కొత్త కలెక్టర్ ఢిల్లీరావుకు శాలువా కప్పి సన్మానించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. ఎన్టీఆర్ పేరు శాశ్వతంగా నిలిచిపోయేలా చంద్రబాబు ఒక్క పని కూడా చేయలేదని దుయ్యబట్టారు. చంద్రబాబు చేయలేని పనిని ముఖ్యమంత్రి జగన్ చేసి చూపించారని అన్నారు. 

ఎన్టీఆర్ పుట్టింది నిమ్మకూరు అయినా... ఆయన బాల్యమంతా విజయవాడలోనే గడిచిందని లక్ష్మీపార్వతి చెప్పారు. ఈ నేపథ్యంలో విజయవాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టి ఆయనకు జగన్ మరింత శోభను చేకూర్చారని కొనియాడారు. ఎన్టీఆర్ తరహాలోనే మరికొన్ని జిల్లాలకు అన్నమయ్య, సత్యసాయి, అల్లూరి సీతారామరాజుల పేర్లు పెట్టడం సంతోషకరమని చెప్పారు.


More Telugu News