ఫుడింగ్ మింక్ పబ్ కేసును తీవ్రంగా పరిగణిస్తున్న పోలీసులు... అత్యవసర భేటీ నిర్వహించిన సీవీ ఆనంద్

  • ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసుల దాడులు
  • 150 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • తెరపైకి ప్రముఖుల పిల్లలు!
  • కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు
హైదరాబాదులో ఇటీవల డ్రగ్స్ ప్రకంపనలు వినిపిస్తున్నాయి. డ్రగ్స్ కు బానిసై ఓ బీటెక్ విద్యార్థి మరణించిన కొన్నిరోజులకే నగరంలోని ఫుడింగ్ మింక్ పబ్ పై పోలీసులు దాడి చేయగా, అనేకమంది ప్రముఖుల పిల్లలు పట్టుబడడం సంచలనం సృష్టించింది. దాంతో ఈ కేసును తెలంగాణ పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా పరిగణిస్తున్నారు. 

తాజాగా, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పోలీసు అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. వెస్ట్ జోన్ పరిధిలోని ఎస్సైలు, డిటెక్టివ్ ఇన్ స్పెక్టర్లు వెంటనే రిపోర్టు చేయాలని స్పష్టం చేశారు. కాగా, పబ్ లో స్వాధీనం చేసుకున్న మాదక ద్రవ్యాలను పోలీసులు ఫోరెన్సిక్ పరీక్ష కోసం పంపారు. ఈ కేసుకు సంబంధించిన సాంకేతిక ఆధారాలపై వెస్ట్ జోన్ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ కేసును నార్కోటిక్స్ ఎన్ ఫోర్స్ మెంట్ వింగ్, వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, ఈ వ్యవహారంలో పబ్ మేనేజర్ కునాల్ పాత్రపై పోలీసులు దృష్టి పెట్టారు. పార్టీకి డ్రగ్స్ తో వచ్చిన వారికి సెక్యూరిటీ క్లియర్ చేయించింది కునాలేనని భావిస్తున్నారు. స్టఫ్, సోడా, బ్రో, కూల్ వంటి సంకేత నామాలతో డ్రగ్స్ సరఫరా చేసినట్టు అనుమానిస్తున్నారు. పార్టీకి డ్రగ్స్ తో వచ్చిన వారితో కునాల్ అనేక పర్యాయాలు ఫోన్ లో మాట్లాడినట్టు గుర్తించారు. ఈ అంశాలపైనా పోలీసులు నిశితంగా దర్యాప్తు చేసే అవకాశాలున్నాయి.


More Telugu News