పాకిస్థాన్ లో 144 సెక్షన్.. ఇమ్రాన్ పై అవిశ్వాసం నేపథ్యంలో భారీగా బలగాల మోహరింపు

  • నేషనల్ అసెంబ్లీ వద్ద కట్టుదిట్టమైన భద్రత
  • తీర్మానానికి ఇమ్రాన్ గైర్హాజరయ్యే అవకాశం
  • ప్రెస్ నూ అనుమతించని అధికారులు
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్ లో పటిష్ఠమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ అవిశ్వాస తీర్మానంలో ఆయన ఓడిపోతే.. అరెస్ట్ చేస్తారన్న ఊహాగానాల మధ్య బందోబస్తును పెంచారు. ఆ దేశ నేషనల్ అసెంబ్లీ వద్ద బలగాలను పెంచారు. 

నేషనల్ అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి కనీసం ప్రెస్ ను కూడా అనుమతించడం లేదు. ఇస్లామాబాద్ లో ఎక్కడికక్కడ 144 సెక్షన్ ను విధించారు. సమూహాలుగా ఏర్పడడాన్ని నిషేధించారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులంతా అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. దీంతో పోలీసులు వాళ్లందరినీ అక్కడి నుంచి పంపించేశారు. 

అవిశ్వాస తీర్మానం కోసం ఇప్పటికే ప్రతిపక్ష సభ్యులు నేషనల్ అసెంబ్లీకి చేరుకున్నారు. 174 మంది సభ్యుల బలం తమకుందని ప్రతిపక్ష నేత భిలావర్ బుట్టో ఇప్పటికే స్పష్టం చేశారు. స్పీకర్ అసద్ ఖైజర్ పై అవిశ్వాసం కోసం వంద మంది చట్టసభ సభ్యులు సంతకం చేశారు. మరోవైపు పంజాబ్ ప్రావిన్స్ (రాష్ట్ర) గవర్నర్ గా ఉమర్ సర్ఫరాజ్ చీమాను నియమించారు. 

ఇమ్రాన్ ఖాన్.. ఇవాళ మధ్యాహ్నం జరగబోయే తీర్మానానికి గైర్హాజరవుతారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తనకు అత్యంత సన్నిహితులతో ఆయన సమావేశం అవుతున్నారు. ఆయన ఇల్లు, ఆఫీసు వద్ద భారీగా బలగాలను మోహరించారు. 

పీటీఐ పార్టీ ఏ విషయంలోనూ అక్రమంగా వ్యవహరించలేదని, రాజ్యాంగ విరుద్ధంగా ఏ పనీ చేయలేదని విద్యుత్ శాఖ మంత్రి హమ్మద్ అజర్ చెప్పారు. ప్రధానిపై అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రజలంతా ప్రశాతంగా ఉండాలంటూ ఆ దేశ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషి సూచించారు.


More Telugu News