ఎమర్జెన్సీ: శ్రీలంకలో భారత బలగాలంటూ వార్తలు హల్ చల్.. వివరణ ఇచ్చిన ఆ దేశ రక్షణ శాఖ

  • భారత బలగాలు వెళ్లాయంటూ వార్తలు
  • తమకు బయటి వాళ్ల సాయం అవసరం లేదన్న శ్రీలంక
  • పరిస్థితిని ఎదుర్కొనే శక్తి తమకుందని వ్యాఖ్య
తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో 36 గంటల పాటు కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది. దేశంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారత బలగాలు సాయం కోసం వచ్చాయంటూ వార్తలు వచ్చాయి. 

దానిపై శ్రీలంక రక్షణ శాఖ స్పష్టతనిచ్చింది. భారత బలగాలు శ్రీలంకకు రాలేదని, వాళ్ల సాయం అవసరం లేదని రక్షణ శాఖ కార్యదర్శి కమల్ గుణరత్నే చెప్పారు. పరిస్థితులను నియంత్రించడంలో స్థానిక బలగాలకు సామర్థ్యం ఉందన్నారు. దేశ భద్రతకు సంబంధించి ఎలాంటి ఆత్యయిక పరిస్థితినైనా వాళ్లు ఎదుర్కోగలరన్నారు. ఈ విషయంలో బయటి దేశాల సాయం తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. కాగా, మరిన్ని తీవ్రమైన ఆందోళనలు జరిగే ముప్పుందన్న వార్తల నడుమ ప్రభుత్వం సోషల్ మీడియా వాడకాన్ని బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే. 

మరోవైపు శనివారం 40 వేల టన్నుల డీజిల్ ను శ్రీలంకకు భారత్ పంపించింది. దేశంలో విద్యుత్ కోతలను నియంత్రించేందుకు వీలుగా ఈ డీజిల్ ను పంపించినట్టు అధికారులు చెప్పారు.


More Telugu News