సీఎస్కే కష్టాలకు తెరపడేనా..? అందుబాటులోకి కీలక ఆటగాడు

  • ఆడమ్ మిల్నేకు మొదటి మ్యాచ్ లో గాయం
  • టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డ క్రిస్ జోర్డాన్
  • ఎట్టకేలకు అందుబాటులోకి దీపక్ చాహర్
  • నెట్ ప్రాక్టీస్ కు హాజరు
  • నేటి మ్యాచ్ కోసం జట్టులో మార్పులు
ఐపీఎల్ 2022 సీజన్ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎన్నో విఘ్నాలు చవిచూస్తోంది. రూ.14 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన దీపక్ చాహర్ దూరం కావడం ఆ జట్టుకు పడిన మొదటి పెద్ద దెబ్బగా చెప్పుకోవాలి. మొదటి రెండు మ్యాచ్ లకు చాహర్ అందుబాటులో లేడు. రెండు మ్యాచ్ లలోనూ చెన్నై జట్టు ఓటమి పాలైంది. ఇప్పటి వరకు ఐపీఎల్ చరిత్రలో సీఎస్కే ఆరంభ రెండు మ్యాచ్ లలో ఓడిపోయింది లేదు. 

కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో మొదటి ఓటమి, కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో రెండో ఓటమిని ఎదుర్కొన్నది. నేడు (ఆదివారం) పంజాబ్ కింగ్స్ తో సీఎస్కే తలపడుతోంది. ఈ మ్యాచ్ లో ఎట్టి పరిస్థితుల్లోనూ నెగ్గి తీరాలన్న పట్టుదల ఆ జట్టులో కనిపిస్తోంది. కానీ, ముఖ్యమైన ఆటగాళ్లు లేకపోవడమే సందేహాలకు అవకాశం ఇస్తోంది.

ఏప్రిల్ చివరి వరకు అందుబాటులో ఉండడని అనుకున్న దీపక్ చాహర్ ఎట్టకేలకు నెట్ ప్రాక్టీస్ కు హాజరయ్యాడు. నేటి మ్యాచ్ లో ఆడతాడా, లేదా అన్నది ఇంకా స్పష్టం కాలేదు. కేకేఆర్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో ఆడమ్ మిల్నే గాయపడ్డాడు. క్రిస్ జోర్డాన్ టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ తో ఆరు రోజులపాటు ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యాడు. 

ముఖ్యంగా బౌలింగ్ లో సీఎస్కే బలహీనంగా కనిపిస్తోంది. తుషార్ దేశ్ పాండే, ముకేశ్ చౌదరి ఆకట్టుకోలేకపోయారు. శివమ్ దూబే ఫర్వాలేదనిపించినా.. లక్నో జట్టుతో మ్యాచ్ లో 19వ ఓవర్ వేసి.. భారీగా పరుగులు ఇచ్చి ఓటమికి కారణమయ్యాడు. క్రిస్ జోర్డాన్ నేటి మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని జట్టు యాజమాన్యం ఆకాంక్షిస్తోంది. అలాగే, యువ పేసర్లు కేఎం ఆసిఫ్, రాజ్ వర్దన్ హంగర్గేకర్ ను రంగంలోకి దింపాలనుకుంటోంది.


More Telugu News